బిజెపి ఎంపీ ఉత్తరాది వారిని తెల్లవాళ్లని, దక్షిణాది వాళ్లను నల్లవాళ్లని మాట్లాడాడు. దీనికి జనసేన అధినేత ఒక్కడే ధీటుగా స్పందించాడు. కానీ మిగిలిన ఎవ్వరూ దీనికి ఖండించడంలేదు. కొందరు మొక్కుబడిగా విమర్శలు చేస్తున్నారు. గతంలో పవన్ ఉత్తరాది, దక్షిణాది విషయాన్ని ప్రస్తావించినప్పుడు వెంకయ్యనాయుడు తనదైన వ్యంగ్యధోరణితో మాట్లాడాడు. స్వాతంత్య్రం వచ్చిన ఇంతకాలం తర్వాత ఇంకా ఉత్తరాది, దక్షిణాది ఏమిటని విమర్శలు గుప్పించాడు.
మరి ఇప్పుడు తరున్‌విజయ్ విషయంలో వెంకయ్య మౌనంగా ఉన్నాడెందుకు? బాధ్యత కలిగిన సీఎం చంద్రబాబు నుంచి జగన్ వరకు అందరూ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇక మన సినిమావారి గురించి, సెలబ్రిటీల గురించి మనం ప్రస్తావించకపోవడమే మంచిది. వీరికి తమ పనులు తప్ప ఇలాంటివి పెద్ద సమస్యలు కనిపించవు. ఇక దక్షిణాది నుండి ఏకంగా కేంద్ర ఆదాయంలో 30శాతం నిధులు కేంద్రానికి వెళ్తున్నాయి. ఆ డబ్బుతో వారు ఉత్తరాదిని అభివృద్ది చేస్తున్నారు. పవన్ చెప్పినట్లుగా జాతి మద్య గీతలు గీస్తున్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారు. జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసింది ఓ దక్షిణాది వ్యక్తే. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మనం ఇచ్చిన ప్రధానే.
కానీ ఆయన శవాన్ని కూడా పూర్తిగా కాల్చలేదు. ఇక రజనీ, చిరు నుంచి స్వర్గీయ ఎన్టీఆర్‌ను సైతం బాలీవుడ్ మీడియా నల్లహీరోలు అని కామెంట్స్ చేసింది. కొందరైతే రజనీ ఆఫ్రికా వెళ్లి సినిమాలు చేయాలని ఎద్దేవా చేశారు. అసలు కొందరు చరిత్రకారులు చెప్పే మాట వింటే ఆశ్చర్యం వేస్తుంది. దక్షిణాది వారు ద్రవిడులు, వీరే మొదటి నుంచి మన దేశంలో ఉన్నారు. ఉత్తరాది వారందరూ ఆర్యులు. వీరు వ్యాపారాల కోసం ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి మన దేశం వలస వచ్చారు. మరి ఈ వాదన వినిపిస్తే ఉత్తరాది వారు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారు....?