బిజెపి ఎంపీ తరుణ్‌విజయ్ చేసిన ఉత్తరాది, దక్షిణాది వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియోలోనో భారతీయులపై దాడులు జరుగుతున్నాయని బాధపడుతున్నవారికి ఈ వ్యాఖ్యలు కనువిప్పు కలిగించేవిగా ఉన్నాయి. మనలో మన తప్పు పెట్టుకుని ఎదుటి వారిని విమర్శించడం మానుకోవాలని సూచిస్తున్నాయి. జీసస్ చెప్పినట్లుగా మన కంట్లో దూలాలను పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలుసును చూసి మనం బాధపడకూడదు.
ఇక తరుణ్‌విజయ్ చిన్న వ్యక్తి కాదు.. ఆయన చేసిన వ్యాఖ్యలు అనాలోచితంగా చేసినవి కావు. ఆయన ఆరెస్సెస్‌లో కీలక సభ్యుడు. ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక పాంచజన్యకు ఎడిటర్, ఓ బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో, అందునా అధికార పార్టీలో ఉన్నాడు. ఆయన క్షమాపణ చెప్పినా దక్షిణాది వారికి అయిన గాయాన్ని అవి మాపలేవు. బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల దృష్టిలో మన రాష్ట్రాలపై చిన్న చూపు తగదు. ఇక మనలో మనం కొట్టుకోవడం మాని, దక్షిణాది వారు కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు. మన తమిళనాడులో కలసి ఉన్నప్పుడు మనలను మద్రాసీలు అనే వారు.
మనం విడిపోయిన తర్వాత తమిళనాడు వారిని ఇడ్లీ, సాంబార్ అని కామెంట్ చేసేవాళ్లం. పాపం.. తమిళనాడు నుంచి, కేరళ నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన వారిని చాయ్‌వాలాలు అనే వారిమి. ఏపీ విడిపోయే ముందు తెలంగాణ వారు ఆంధ్రా వాళ్లను కర్రీలు అమ్మేవారు అని స్వయాన కేసీఆర్ చులకన చేశాడు. ఏపీ వాళ్లేమో తెలంగాణ వారికి మేమే అన్ని నేర్పాం.. వారికి తెల్లన్నం పరిచయం చేసింది మేమే.. అని మనలో మనం విమర్శలు చేసుకుంటున్నాం.. కానీ తమిళనాడులోలాగా మనం కూడా ఉత్తరాదివారి అహంకారానికి చెక్‌పెట్టడానికి వారు తమిళంలోనే మాట్లాడి హిందీ ప్రస్తావనే లేకుండా చేయాలి.
ఇక తమిళనాడు ప్రజలు ఎక్కువగా రైళ్లపై ఆధారపడరు. రేటు ఎక్కువైనా కూడా వారి రాష్ట్రంలోని బస్సులలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తారు. తమ ఆదాయం కేంద్రానికి వెళ్లకూడదని, తమ సొమ్ము తమ రాష్ట్రానికే దక్కాలనేది వారి సిద్దాంతం. భారతీయులుగా దేశభక్తి కలిగిన వారికి ఇది తప్పుగా కనిపించినా కూడా ఇది వాస్తవం. దేశభక్తిని మాటల్లో చెప్పే ఉత్తారాది వారు పెదవులతో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తున్నారు. ఈ విషయంలో తరుణ్‌విజయ్ ఒక్కడే క్షమాపణ చెబితే సరిపోదు. స్వయాన మోదీ కూడా దక్షిణాది వారికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది...!