హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడంలో తప్పులేదు. కావాలంటే వారి ఫొటోలను పెట్టుకుని పంచామృతాభిషేకాలు, పాలాభిషేకాలు.. చేసుకున్నా. తమ హీరోల గురించి భజనలు, కీర్తనలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు రాసుకొని సాయంత్రం వేళల్లో, వీలున్నప్పుడు భజనమండలి కార్యక్రమాలు, సత్సంగాలు చేసుకున్నా పర్వాలేదు... కానీ ఇతరుల గురించి, అభిమానించే హీరోల గురించి వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం మంచిది కాదు. ఈ మధ్య చిరంజీవి గురించి ఓ విషయం బయటికి వచ్చింది. తన స్నేహితుల కోసం 'యముడికి మొగుడు' చిత్రం చేసి సహాయం చేశాడని అన్నారు. అది నిజమే.
కానీ తన కెరీర్‌కు ఎంతో సహాయపడిన కమెడియన్ సుధాకర్, నారాయణరావు, హరిప్రసాద్‌లు చేసిన త్యాగం కంటే చిరు చేసిన త్యాగం పెద్దదేమీ కాదు. పోనీ వారు చెప్పినట్లు తన స్నేహితుల కోసం చిరు ఆ చిత్రం చేసి ఉంటే.. మరి ఆ తర్వాత కూడా వారిని ఎందుకు చేరదీయలేదు? అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు? తాను మెగాస్టార్‌గా ఎదగడానికి ఉపయోగపడిన విజయబాపినీడు, కె.ఎస్.రామారావు, కోదండరామిరెడ్డి, యండమూరి వంటి వారిని ఎందుకు దూరం పెట్టాడు? తన కెరీర్ తొలినాళ్లలో లిఫ్ట్ ఇచ్చిన తమ్మారెడ్డిని ఎందుకు మర్చిపోయాడు? అల్లుఅరవింద్, అశ్వనీదత్ వంటి వారికే ఎందుకు పరిమితమైపోయాడు?
చిరు అనే కాదు... బాలయ్య కూడా తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిన కోడిరామకృష్ణ, ఎస్.గోపాల్‌రెడ్డి వారిని ఎందుకు దూరం చేసుకున్నాడు? బెల్లంకొండ వంటి వారికి ఎందుకు చోటిచ్చాడు? అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే రూట్ లో వెళుతున్నాడు. కాబట్టి వీటిపై కామెంట్ చేయడం తప్పు. ఇది బిజినెస్.. ఎవరి స్వార్ధం వారు చూసుకుంటారని నిజాయితీగా ఆలోచిస్తే ఎంతటి అభిమానులకైనా ఇది తెలుస్తుంది!