నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు. కీరవాణి ఇటీవల దర్శకుల విషయంలో, తెలుగు సినీ సాహిత్యం విషయంలో చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. అందరూ ఆయనపై మండిపడ్డారు. కానీ ఆయన ఆవేదన ఆ తర్వాత తన ట్వీట్స్‌లో తెలిపాడు. అనంతశ్రీరామ్‌ను, చంద్రబోస్‌లను ఉదాహరణగా చెప్పాడు. ముందుగా తొందరపడి మండిపడిన మాలాంటి వారికి కనువిప్పు కలిగించి, తనలోని భావాలను, వాటి ఉద్దేశ్యాలను తెలిపాడు. నిజమే.. నేను పనిచేసిన దర్శకులంతా బాగా బుర్ర ఉన్నవారు... నేనే తెలివిలేని, బుర్రలేని వాడినని పేర్కొన్నాడు.
ఆయన ఉద్దేశ్యం నిజమే కావచ్చు. కానీ బహిరంగంగా అలాంటి కామెంట్స్ చేయడం తగదనేది ఇప్పటికీ అందరి అభిప్రాయం. ఇక ఇళయరాజా కూడా బాలుని ఎందుకు తన పాటలు పాడవద్దని చెప్పాడో కూడా అర్ధమైంది. ఇక తాజాగా రాజమౌళి 'బాహుబలి' షూటింగ్‌లో రోజుకు అంటే 8గంటల పనికి దాదాపు 30లక్షలు దాకా ఖర్చయ్యేవని, ఒక్క గంట షూటింగ్ వేస్ట్ అయినా నిర్మాతలకు లక్షల్లో నష్టం వచ్చేదని పేర్కొన్నాడు. అందుకే తాను ఆ చిత్రంషూటింగ్‌లో ఆవేశంతో,కోపంతో తిట్టేవాడినని, అది నిర్మాతల కోసమే గానీ, తన కోపం యూనిట్ మీద కాదని తెలిపాడు.
ఈ చిత్రం యూనిట్‌లో పనిచేసిన కొందరు రాజమౌళి తమను అవమానకరంగా మాట్లాడుతున్నాడని, కోపగించుకుంటున్నాడని తెలిపి, దానిని రాయమని చెప్పేవారు. కానీ రాజమౌళి బాధ ఇప్పుడు అర్ధమైంది. ఇక తాను గ్రాఫిక్స్ చిత్రాలు, గిమ్మిక్కులే చేస్తాననే వ్యాఖ్యలకు కూడా ఆయన సరైన సమాధానం ఇచ్చాడు. 'బాహుబలి2' తర్వాత తాను కొంత కాలం విశ్రాంతి తీసుకుంటానని, ఆ తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎలాంటి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు లేకుండా ఎమోషన్స్‌తో నడుపుతానని తెలిపాడు. దట్స్ రాజమౌళి... మంచి నిర్ణయం..!