క్రైస్తవ మతగురువుగా ఉండి. వైఎస్ రాజశేఖర్‌రెడ్దితో సహా పలువురు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వచ్చే కె.ఎ.పాల్ మరోసారి చిత్ర పరిశ్రమపై పడ్డాడు. ఆయన తాజాగా చేసిన ట్వీట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన పూరీజగన్నాథ్‌ని ఉద్దేశించి.. పూరీ.. ఇప్పుడే నీవు తీసిన 'రోగ్' చిత్రం చూశాను. కథ బాగా ఉండివుంటే ఈ చిత్రం బాగుండేది. నీవు ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి సీటు తీసుకొని సామన్లు సర్దుకొని అమెరికా రా.. నేను నీకు వీసా పంపిస్తాను. నీవు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ట్వీట్ చేశాడు. ఇక బండ్లగణేష్‌పై ఆయన వేసిన సెటైర్ అద్భుతంగా ఉంది. బండ్లగణేష్.. నువ్వు అనుకుంటే ట్రంప్‌తో ఫొటో దిగగలవు. కానీ ట్రంప్ నాతో ఫొటో దిగాలని భావిస్తుంటాడు... అంటూ చురక వేశాడు.
ఇక రాజమౌళిని ఉద్దేశించి 'నీవు బాహుబలి-2' ప్రమోషన్ కోసం లక్షలు ఖర్చుపెట్టావు. నేటి ఏపీ ప్రభుత్వం మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కోట్లు ఖర్చుపెట్టింది.. అంటూ రాజమౌళితో పాటు చంద్రబాబును ఇరికించాడు. మరోపక్క ఇండియాలోని మేధస్సు ఉన్న వారిలో రాంగోపాల్‌వర్మ మూడో స్థానంలో ఉంటాడు. దీనిలో నేను లేను. నేను ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వంటి వాడిని అన్నాడు.
ఇక తన 'పౌలిజాన్ని' 'పవనిజం'తో పోల్చవద్దని, పవనిజం కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, కానీ పాలిజం ప్రపంచానికి ఇంకా చెప్పాలంటే విశ్వానికి సంబంధించిందని చెప్పి పవన్ అభిమానులను తుత్తుర తీర్చాడు. గత కొన్నిరోజుల కిందట ఆయన ఇండియాలో మోదీ, హిల్లరీపై ట్రంప్‌లు నావల్లే గెలిచారని చెప్పిన సంగతి తెలిసే ఉంటుంది. మరోపక్క ఇండియన్ ఐడల్‌గా ఎన్నికైన రేవంత్‌పై కూడా విమర్శలు గుప్పించాడు. మొత్తానికి మత ప్రచారకుడు అయిన పాల్ మరోసారి సంచలనాలకు కేంద్రమయ్యాడు.