లేడీస్ టైలర్ (1986) ఓ సంచలనం. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కు కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు వంశీ మంచి ఫామ్‌లోకి రావడానికి దోహదపడింది. నిర్మాత స్రవంతి రవికిషోర్‌ని నిలబెట్టింది. ఇంతటి పేరున్న లేడీస్ టైలర్ సీక్వెల్ అంటూ 'ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్' పేరుతో సినిమా వస్తోంది. గురువారమే ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
'లేడీస్ టైలర్'కు ఒక కొడుకు ఉంటే, వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడు? అనే ఊహజనిత ప్రశ్న వేసుకుని ఫ్యాషన్ డిజైనర్ కథని సిద్ధం చేసుకున్నారు. సీక్వెల్ అని చెప్పడం క్రేజ్ కోసమే తప్ప, దానికీ, దీనికి సంబంధం ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ సీక్వెల్‌కు కూడా వంశీనే దర్శకుడు. నిజానికి సీక్వెల్‌ను రవితేజతో తీయాలని వంశీ ప్లాన్ చేశారు. 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' తర్వాత ఈ ప్లానింగ్ జరిగింది. అప్పటికే రవితేజ రేంజ్ పెరగడం వల్ల సీక్వెల్ చేయలేనని స్పష్టం చేశాడు. దాంతో ఫ్యాషన్ డిజైనర్ మూలన పడింది. వంశీ అంటే అభిమానం ఉన్న మధుర శ్రీధర్ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. డి.సురేష్‌బాబు చిన్న కుమారుడు అభిరామ్‌తో తీస్తారని ప్రచారం జరిగినా చివరికి ఎం.ఎస్. రాజు కుమారుడు సుమంత్ అశ్విన్‌తో పూర్తిచేశారు.
'లేడీస్ టైలర్' అనగానే రాజేంద్రప్రసాద్, శుభలేక సుధాకర్, మల్లికార్జునరావు, ప్రదీప్ శక్తి ధరించిన పాత్రలు గుర్తుకువస్తాయి. 'ఫ్యాషన్ డిజైనర్...'లో అన్నీ కొత్త పాత్రలే కనిపిస్తాయి. టైటిల్ పాత్రలో హుషారుదనం కనిపించాలి. అలాంటి చలాకీతనం సుమంత్ అశ్విన్‌లో ఉంటుందా అంటే అనుమానమే. అయితే కొత్తవారితో కూడా చేయించుకోగల సత్తా ఉన్న వంశీపై ఉన్న నమ్మకంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చు.