స్టార్ హీరోలపై చిన్నపాటి విమర్శ వచ్చినా ఆయా స్టార్స్ అయినా తట్టుకోగలరేమో గానీ వీరాభిమానులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. విపరీతమైన వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. డబ్బులు సంపాదిస్తూ, కళామతల్లి సేవ అనే పేరును వాడుతున్న విధానంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే స్టార్స్ మాట్లాడేదాన్నివింటే కళామతల్లి సేవ అంటే ఇదేనా అని అనిపించకమానదు. ఇటీవల చిరు మాట్లాడుతూ, తన 150 వచిత్రం రిలీజ్ సమయంలో తనకు మరలా కళామతల్లి సేవ చేసుకునే మహదావకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇక మోహన్‌బాబు గురించి చెప్పుకోవడం అనవసరం. ఆయన తరచు తాను కళామతల్లికి సేవ చేస్తున్నానని చెబుతున్నాడు. తాజాగా ఆయన మరోసారి తన కుమారులైన మంచు విష్ణు, మనోజ్‌లను, కూతురు మంచు లక్ష్మిని కూడా కళామతల్లి సేవకే అంకితం చేశానని వ్యాఖ్యానించాడు. ఇక తన ఫస్ట్‌లుక్ ఉగాది రోజున వస్తుందని భావించి నిరాశ చెందిన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మహేష్ మేము మీ కోసం రాత్రింబగళ్లు కష్టపడుతున్నాం.. అని ట్వీట్ చేశాడు. మరి వీళ్లంతా కళామతల్లికి సేవ చేస్తున్నామని, ఆ భాగ్యం కలిగిందని చెబుతున్నారు..కానీ, కళామతల్లి పెట్టిన బిక్ష వల్ల వారు చేసుకునే, చేసే వ్యాపారాల గురించి మాత్రం..ఏ హీరో తెలపడు. ఈ విషయం అభిమానులమని చెప్పుకునే వారు గమనిస్తే మంచిది. వారంతా కళామతల్లికి, అభిమానులకి సేవ చేయడం కోసమే సినిమాలు చేస్తున్నారంట.