ప్రతి భాషలోనూ ఎన్నో పదాలు, నిఘంటువులు ఉంటాయి. ఇది పత్రిక భాష, ఇది అన్‌పార్లమెంటరీ పదం అని కొందరు కొన్నింటిని సూత్రీకరిస్తున్నారు. వాస్తవానికి కొన్ని ఇంగ్లీష్ పదాలకు తెలుగులో పెట్టే పేర్లు ఎంతో గందరగోళంగా ఉంటున్నాయి. కొందరు ఈనాడు పత్రికలో రాసిందే నిజమైన భాష అంటుంటారు. ఈనాడులో ఇంటర్నెట్‌ను అంతర్జాలం, ఔటర్‌రింగ్‌రోడ్డును బాహ్యవలయ రహదారి, ఫైల్‌ను దస్త్రం.. అని రాస్తుంటారు. దానిలో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. అలాంటి కొత్త కొత్త పదాలను తయారు చేయడం మంచిదే. కానీ అందరూ అవే వాడాలని సూచించడం చేతగానితనం.
ఈనాడులో 'చెప్పబడింది... ఇల్లు అమ్మబడును' వంటి పదాలను నిషేధిస్తారు. 'బడు'.. వాడు బడుద్దాయి అంటారు. మరి 'ఇల్లు అమ్మబడును.. ఇల్లు అద్దెకు ఇవ్వబడును...' అనే వాటికి తెలుగులో సులభతరమైన పదాలు, వాక్యాలు ఏమైనా ఉన్నాయా? తమిళంలో రోబోని రిలీజ్‌చేసే సమయంలో దానికి తగ్గ తమిళ పదం కోసం అన్వేషించి చివరకు 'యంతిరన్' అన్నారు. అదే సినిమా తెలుగువెర్షన్‌లో 'యంతిరన్' అనే పదాన్ని 'యంత్రుడు'గా ఉపయోగించారు. ఈ తరహా పద ప్రయోగాలు మంచివే అయినా ప్రాస కోసం పాకులాడి, విచిత్రమైన పదాలను సృష్టించకూడదు.
గతంలో ఓ పాటల రచయిత బాలకృష్ణ నటించిన చిత్రంలోని పాటలో 'అందమైన ఆడదాన్ని చూస్తే ఆగలేనంటోంది.. నందమూరి వంశం' అనే అర్ధం వచ్చేలా నందమూరి అభిమానులను పొగడటానికి రాశాడు. కానీ అది వింటే నందమూరి వంశంలోని వారు అందమైన ఆడవాళ్లను చూస్తే ఆగలేరు.. అనే ద్వందార్ధం ఉంది. ఇక బూతులను పత్రికా భాషలో వాడకూడదన్నారు.
కానీ శ్రీశ్రీ వంటి మహాకవే తన కవితలో 'లంజకొడుకులసలే మెసలే...' అని ఓ రచన చేశారు. సాంప్రదాయవాదులు ఆయనపై మండిపడ్డారు. కానీ అది తప్పుడు పదం కాదని, తన భాషా, భావావేషాన్ని ప్రతిబింబించే పదప్రయోగమన శ్రీశ్రీ తేల్చాడు. ఇక ఒకప్పుడు కులాలనుపేరు పెట్టి చెప్పకుండా ఓ సామాజిక వర్గమని, ఆ మంత్రికి చెందిన సామాజిక వర్గమని రాసేవారు. దళితులను కూడా కులం పేరుతో పిలవడం ఆనాడు తప్పు. కానీ నేడు మాదిగలతో పాటు పలు కులాల వారు ధైర్యంగా తమ కులాల చివరన మాదిగ, యాదవ అనిపెట్టుకుంటున్నారు. దీంతో నేడు పత్రికల్లో, సోషల్‌మీడియాలో కూడా కులం పేరును నిరభ్యతరంగా వాడుతున్నారు. కాలాన్ని బట్టి వచ్చే మార్పులను మనం ఆహ్వానించాలే గానీ ఫలానా పదం వాడకూడదు... ఫలాన పదమే వాడాలి..అని నియంత్రించడం మూర్ఖత్వమే అవుతుంది.