జనసేన పార్టీని స్థాపించిన పవన్ భావాలకు పలువురు తటస్తులు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా మేథావి వర్గం.. ఆయన ఏమైనా మార్పు తీసుకొని వస్తాడా? అని ఎదురుచూస్తోంది. దానికి తగ్గట్లుగానే కొందరు మేధావులు పవన్ భావజాలంపై సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. పవన్ ఏపీతో పాటు తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించాడు. దీంతో పవన్ ఏపీపై పెట్టిన శ్రద్ద తెలంగాణపై చూపడం లేదని, ఆయనకు అక్కడ ఎవరు ఓటు వేస్తారు? అనే ప్రశ్నలు ఉదయించాయి.
తాజా సమాచారం ప్రకారం తెలంగాణకు చెందిన ( సారీ.. భారతదేశానికి చెందిన) ప్రముఖ విప్లవకారుడు, ఉద్యమకారుడు, ప్రజా కవి గద్దర్.. పవన్ భావజాలంపై సానుకూలంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అలాగే త్వరలో సొంతపార్టీ పెట్టాలని యోచిస్తున్న కోదండరాం, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ వంటి వారు కూడా పవన్ భావాలపై సానుకూలంగా ఉన్నారు. మరివీరందరూ సొంత పార్టీలను వదిలేసి పవన్ నాయకత్వంలోని 'జనసేన'లోకి వస్తారా? అంటే అనుమానమే. ఎప్పుడు ఓకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఒక పార్టీలో ఒక నాయకుడు, ఒక మేథావి మాత్రమే ఉండేతత్వం ఎక్కువ.
కానీ పవన్ హుందాగా వ్యవహరిస్తే ప్రస్తుతం తమ కార్యాచరణను రూపొందించుకుంటున్న గద్దర్, కోదండరాం, జెపి వంటి వారు తామే సొంతగా పార్టీలను స్థాపించినా, తమకు ఆల్‌రెడీ ఉన్న పార్టీలను కూడా పవన్‌తో సయోధ్యకు సిద్దమవుతారు. పార్టీలు వేరైనా కలిసి పనిచేస్తారు. వామపక్షాలు కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. కానీ వీరందరూ కలిసి పొత్తుతో పోటీ చేసినా కూడా అది ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌ల వ్యతిరేక ఓట్లును చీల్చి మరలా టిడిపి, టిఆర్‌ఎస్‌లకే మేలు చేస్తారేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
ఇక గద్దర్, కోదండరాం, జెపి, వామపక్షాల వంటి పార్టీల విషయంలో పవనే ముందుగా చొరవచూపాలి. కానీ పవన్ ఇప్పటికే నాకు ఇంకా అనుభవం లేదు కాబట్టి నేను ఎవ్వరినీ నాతో కలవమని అడగను, ఎవరైనా వారంతట వారు ముందుకు వస్తే నేను కలుస్తాను అని చెప్పేశాడు. దీంతో పిలవని పేరంటానికి గద్దర్, కోదండరాం, జెపిలు ముందుకు ఎందుకు వస్తారు ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.