బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని చంద్రబాబు అనారోగ్యకారణాల వల్ల మంత్రి పదవి నుంచి తప్పించడంతో వివాదం ఎక్కువవుతోంది. పాపం.. ఇప్పుడు అన్ని పార్టీలకు బొజ్జల మహాత్ముడుగా కనిపిస్తున్నాడు. కబ్జాలు, అరాచకాలు, బంధుప్రీతిలో రెచ్చిపోతున్న బొజ్జలకు బాబు బాగానే చెక్ చెప్పాడు. కానీ ఇదే విపక్షాలకు అస్త్రంగా మారింది. కాంగ్రెస్, వైసీపీలు ఇప్పుడు వింత వాదన వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జక్కంపూడి రామ్మోహన్‌రావుకు తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన్ను మానవతా దృక్పథంతో పదవిలో కొనసాగించారని, కానీ చంద్రబాబుకు కనీసం మానవత, మానవ విలువలు తెలియవని జగన్ నుంచి అందరూ విమర్శిస్తున్నారు. కానీ వారి వాదనలో తప్పుంది.
ఓ మంత్రికి అనారోగ్యం కారణంగా పదవి తొలగించడమే సబబు. తన అనారోగ్యం వల్ల తన పదవికి, మంత్రిత్వశాఖలకు, ప్రజలకు న్యాయం చేయలేని వారిని తొలగిస్తే తప్పేంటి? అంటే వారు అనారోగ్యం, వయసు రీత్యా ఏ పనులు చేయకపోయినా కూడా మానవత్వం పేరుతో వారిని కొనసాగిస్తే ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా? వారు ప్రజలకు భారం కాదా? అంతగా మానవ విలువలు, మానవీయత ఉంటే మరో రకంగా సహాయం, ఆర్థికసాయం, లేదా తమ పార్టీలోనే ఏదైనా సలహాదారు వంటి పదవులను ఇవ్వవచ్చు గానీ తమ స్వార్థం కోసం పనిచేయలేని మంత్రిని ప్రజలపై రుద్దడం ఎంతవరకు సమంజసం.. ? అందుకే రాజకీయనాయకులకు కూడా విద్యార్హతలు, రిటైర్‌మెంట్ పద్దతి, నిర్ణీత కాలపరిమితి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన నాయకులకు ఈ మాటలు చేదుగానే ఉంటాయి....!