నాగార్జున చాలా జెంటిల్ మేన్.. భేషజాలకుపోడు... వాస్తవాలను ఒప్పుకునే దమ్ము అతనికుంది. ఎంతటి ప్రశ్నకైనా సూటిగా సమాధానం ఇస్తాడు. కలెక్షన్లు, రికార్డులు, నెంబర్‌గేమ్స్ వంటివి పట్టించుకోడు...తన చిత్రం బాగా లేకపోతే ఒప్పుకుంటాడు. తన సినిమాలు, తన బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉంటాడు. రాజకీయంగా కొన్ని వివాదాలు, కామెంట్స్ వచ్చినా మౌనంగా నవ్వుతూ తప్పుకుంటాడు. ఇక ఆయన ఓసారి ఓ ఇంటర్వ్యూలో ఓ మాట చెప్పాడు. తాను చేసే ప్రతి సినిమాని ఇష్టపడి, కష్టపడి, విజయం సాధించాలనే తపనతోనే చేస్తాను. ఇక జయాపజయాలు మన చేతిలో లేవు. ప్రేక్షకులదే అసలైన తీర్పు, దానికి నేను శిరసావహిస్తాను. కానీ కుంటిసాకులు చెప్పను అని చెప్పారు. ఇది నిజమే. ఇదే మాటని అందరూ చెబుతారు. కానీ అది మనసులో నుంచి కాదు.. గొంతుల్లోంచే వస్తాయి ఆ మాటలు.
కానీ నాగ్ చెప్పిందే చేస్తాడు. ఇక ఆయన అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఏ సినిమా చేస్తున్నా కూడా సినిమా బాగుంటుందని, మంచి చిత్రం అవుతుంది. కష్టపడుతున్నాం.. అనే చెబుతాను కానీ తాను ఎప్పుడూ సినిమా విడుదలకు ముందే నా చిత్రం ట్రెండ్‌సెట్టర్ అవుతుందని భజన చేయనని చెప్పాడు. అది నిజమే.. ఆయన 'శివ, గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, మన్మథుడు' చిత్రాల సమయంలో కూడా ఆయన ట్రెండ్‌సెట్టర్స్ అవుతాయని చెప్పలేదు. కానీ అవి విడుదలైన తర్వాత ట్రెండ్‌సెట్టర్స్‌గా నిలిచి మాటల్లో కాదు.. చేతల్లో చూపించాయి. కానీ నేడు నాగ్‌లో మునుపటి లక్షణాలు కనిపించడం లేదు. అసహనం పెరిగిపోతోంది. ఇటీవలే తన కుమారుడు నాగచైతన్య నటిస్తున్న చిత్రం, అఖిల్ చిత్రం ట్రెండ్‌సెట్టర్స్‌గా నిలుస్తాయని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నాడు. ఎవరి నుంచైనా ఈ వ్యాఖ్యలు వినవచ్చేమో గానీ నాగ్ నుంచి ఈ మాటలు విన్నవారికి ఆయన తన పంధా మార్చాడా? అనే అనుమానం రాకమానదు.