జనసేన పార్టీని స్థాపించిన పవన్ తన అన్నయ్య చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీలేని లోటును పూరిస్తారా? లేదా? అనే ఆసక్తికర చర్చసాగుతోంది. కాగా చిరు పార్టీని పెట్టినప్పుడు పరకాల ప్రభాకర్‌తో పాటు సమరం, చివరకు పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభాహుడి వంశస్తుడైన డాక్టర్ మిత్ర కూడా చిరువైపు ఆకర్షితుడయ్యారు. విప్లవభావాలతో తమ పేరు చివర ఉన్న రెడ్డి అనే తోకను కత్తిరించి, తమకు ఉన్న వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి వేసి పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి కాస్తా పుచ్చలపల్లి సుందరయ్యగా మారారు. అవే భావాలున్న మిత్రా కూడా ఆయన బాటలోనే నడిచేవాడు. కానీ వీరంతా పెట్టుకున్న ఆశలను చిరు నెరవేర్చలేకపోయాడు. దీంతో వారందరూ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
తనకు ఓట్లేసిన కోట్లాదిమంది మనోభావాలను దెబ్బతీస్తూ చిరు తనపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. కానీ చిరు గెలుపొందిన స్థానాలు తక్కువే అయినా తన పార్టీని ఇప్పటివరకు నిజాయితీగా నడిపి, కష్టనష్టాలకు ఓర్చుకొని ఉంటే వైఎస్ మరణం, చంద్రబాబు వ్యతిరేకతల వల్ల ఆయనకు ఇప్పుడు మంచి అవకాశం ఉండేది. జగన్ సోదిలో కూడా ఉండేవాడు కాదు. కానీ చిరు తప్పు చేశాడు. ప్రజారాజ్యం అనేది ఓ రాజకీయ పార్టీ. దాని కోసం కోట్లమంది ఓట్లు వేశారు. అది ప్రజల సొత్తు. కానీ ఆ విషయం గ్రహించని చిరు అదేదో తన సొంత ఆస్తి అన్నట్లు, తమ సొంత సినిమా అన్నట్లు, తన సొంతబేనర్ అన్నట్లుగా ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా పార్టీని విలీనం చేశాడు. మరి ఈ విషయంలో పవన్ ఎంత ముందుచూపుతో, ప్రజారాజ్యం అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడా? లేదా? అనేది వేచిచూడాలి.