పవన్ నటించిన 'కాటమరాయుడు' ఫలితమెలా వున్నా పవన్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించే చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పుడే పవన్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు నటిస్తున్నారు. వీరితోపాటు సీనియర్ నటి ఖుష్బూ కూడా ఈ చిత్రంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నిన్న సోమవారమే మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేకమైన కాఫీ షాప్ సెట్ లో మొదటి రోజు షూటింగ్ ని స్టార్ట్ చేశారు. మొదటి రోజు షూట్ లోనే పవన్ - అను ఇమ్మాన్యుయేల్ ల మీద మొదటి షాట్ చిత్రీకరించారు.
ఇక మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ వారంలోనే పవన్ - త్రివిక్రమ్ సినిమా సెట్స్ లో జాయిన్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ దాదాపు ఒక నెల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనబడనున్నాడు.
ఇక త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మొదలైన మూడో ప్రాజెక్ట్ మీద లెక్కకు మించి అంచనాలున్నాయి.