చంద్రబాబు తన వారసునిగా లోకేష్‌ని తెచ్చే ముందు ప్రజలను దానిని చేరవేయడంలో తన రాజకీయ చాణక్యాన్ని చూపించాడు. రాజకీయాలలోకి యువత రావాలంటూ డబ్బాలు కొట్టి, చెప్పిందే చెప్పాడు. చివరకు తాను అనుకున్నట్లు లోకేష్‌ని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడు. భవిష్యత్తులో ఆయన్ను సీఎం చేయాలని కలలు గంటున్నాడు. మరి యువతే రాజకీయాలలోకి రావాలంటే జగన్ యువకుడు కాదా? ఆయన కూడా యువ నాయకుడే కదా...! కానీ దీనికి చంద్రబాబు వద్ద సమాధానం ఉండదు. అదేమంటే అవినీతిపరులు రాజకీయాలలోకి రాకూడదంటున్నాడు. మరి అవినీతి మకలీ అంటని, యువకుడైన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడ యువకుడే కదా...! దీనికి బాబు వద్ద ఆన్సర్ ఉండదు. అదేమంటే ఆయనకు రాజకీయాలు తెలియవు అంటాడు.
మరి టిడిపిని స్థాపించి స్వర్గీయ ఎన్టీఆర్‌కు ముఖ్యమంత్రి కావడానికి ముందు రాజకీయ అనుభవం ఉందా? ఆయనేమైనా సీఎం అయ్యేనాటికి యువకుడా? వీటిని అడిగితే దుర్భాషలాడి, మీడియాపై విరుచుకుపడటమే బాబుకు తెలుసు. మరి నిజాయితీపరులే రాజకీయాలలోకి రావాలంటాడు. మరి లోకేష్ నిజాయితీపరుడా? జయప్రకాష్‌నారాయణ నీతిపరుడైనప్పటికీ ఆయన్ను చంద్రబాబు ఎందుకు ఆహ్వానించడం లేదు. గత ఎన్నికల్లో లోక్‌సత్తా టిడిపి, బిజెపి, పవన్‌లతో పొత్తు పెట్టుకోవాలని భావించినా ఆయన ఎందుకు ముందడుగు వేయలేదు? మరి పవన్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం పెద్ద మైనస్ అయితే లోకేష్‌కి ఉన్న రాజకీయ పరిజ్ఞానం, అనుభవం ఎంత? వీటికి బాబు వద్ద సమాధానం లేదు.
ఇక బొజ్జలను అనారోగ్యం వల్ల తప్పించానంటున్నాడు. మరి చంద్రబాబు ఆరోగ్యంగా, ఒకప్పుడు ఉన్న ఉత్సాహంతోనే ఉన్నాడా? వాస్తవానికి బొజ్జల శ్రీకాళహస్తిలో అవినీతిని పెంచిపోషిస్తున్నాడు. ఆయన భార్య, కుటుంబసభ్యులు అరాచకాలు చేస్తూ శాసిస్తున్నారు. మరి ఆ విషయం దాచి కేవలం అనారోగ్యం అనే వంకతో బాబు బొజ్జలను తొలగించడం చూస్తే బాబులోని ఒకప్పటి డైనమిక్ లీడర్ ఇప్పుడు లేడని అర్ధమవుతోంది.