పవన్‌లో ఓ దార్శనికుడున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయనకు సమాజంలో జరుగుతున్న ఘటనలు, విషయాలపై ఆలోచన ఉంది. ఆయన తాజాగా మాట్లాడుతూ, 'చట్టాలు బలవంతులపై బలహీనంగా.. బలహీనులపై బలంగా పనిచేస్తున్నాయని' వాపోయాడు. ఇప్పుడు ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును పరిస్థితి చూస్తుంటే అది అక్షరసత్యమని నిరూపితమవుతోంది. ఎంతమంది నిర్దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదని, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని మన రాజ్యాంగాలు, చట్టాలు చెబుతున్నాయి.
కానీ రాజకీయ ప్రభావం, పోలీసుల తప్పుకారణంగా సత్యంబాబు జీవితం నాశనమైంది. 'సత్యం వధ.. ధర్మం చెర' అనేవి జరిగిపోయాయి. కాగా సినిమా దర్శకులకు విజన్ అనేది చాలా ముఖ్యం. గతంలో మణిరత్నం, శంకర్, టి.కృష్ణ వంటి వారు ఈ విషయాన్ని నిరూపించారు. కాగా సత్యంబాబు ఉదంతంలో మనం రెండు చిత్రాలను గుర్తు చేసుకోవాలి. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయో ఎప్పుడో వచ్చిన రెండు చిత్రాలల్లో చెప్పారు.
అందులో ఒకటి ది గ్రేట్ మౌళి దర్శకత్వంలో సీనియర్ నరేష్ హీరోగా వచ్చిన 'హలో డార్లింగ్ లేచిపోదామా' ఒకటి. కొన్ని సెన్సార్ నిబంధనల వల్ల ఆ టైటిల్‌ను తర్వాత కాస్త మార్చారు. ఇక అదే పాయింట్‌ను తీసుకొని కొంత బ్యాక్‌డ్రాప్‌ను మార్చి నేటి దర్శకుడు హరీష్‌శంకర్ రవితేజ, జ్యోతిక జంటగా 'షాక్' చిత్రం తీశాడు. ఇప్పుడు ఆ చిత్రాలను చూస్తుంటే 'సత్యంబాబు' ఉదంంతంతో కూడా ఇలాగే జరిగి ఉంటుందేమో అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండు సినిమాలు సినిమా అనేది కేవలం వినోదానికే కాదు.. దానికి మించిన పరమార్ధం ఉందని నిరూపిస్తున్నాయి.