నేడు చట్టాలు, రాజకీయాలు చివరకు న్యాయస్థానాలపై కూడా ప్రజలకు నమ్మకం పోతోంది. అన్నింటినీ పదవి, డబ్బులే శాసిస్తున్నాయి. దీనికి ఎవ్వరూ, ఏ రంగం కూడా అతీతం కాదు. కాగా అయేషామీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాస్తవానికి ఆయేషామీరా హత్యను ఎవరు చేశారో అందరికీ తెలుసు. చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడటం సబబు కాదు కాబట్టి ఓ రాజకీయ నాయకుడి మనవడి కోసం, మరో ముఖ్యమంత్రి ఇచ్చిన అభయం మేరకు అందులోకి అమాయకుడైన సత్యంబాబును పోలీసులు ఇరికించారు. అతడిని తప్పు ఒప్పుకొని, కేసులో తానే నేరస్తున్నని ఒప్పుకోవాల్సిందిగా అన్ని శాఖలు కుమ్మక్కై.. బలవంతం చేశాయి.
పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆయన కాళ్లు చేతులు కూడా విరిగిపోయి, పక్షవాతం కూడా వచ్చింది. చివరకు బాధితురాలి తల్లిదండ్రులు కూడా అతను నేరస్థుడు కాదని, నిజమైన నేరస్థుడు వేరే అనిచెప్పినా కూడా పట్టించుకోలేదు. ఓ మనిషి జీవితాన్ని నిలువునా 8ఏళ్లు నాశనం చేశారు. కిందికోర్టులు సత్యంబాబుకు వ్యతిరేకంగా తీర్పు చెప్పాయి. ఇప్పుడేమో హైకోర్టు అతను నిర్దోషి అనిచెప్పింది. ఆయనకు ఓ లక్ష పరిహారం ఇవ్వాలని, ఆనాటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించింది. చివరకు ఆయేషా తల్లి కూడా ఆయనకు లక్ష కాదు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
మరి ఎంతిచ్చినా అతని ఎనిమిదేళ్ల కాలాన్ని, ఆయన అనుభవించిన క్షోభను తిరిగి తెచ్చిస్తారా? మరి రేపు సుప్రీం కోర్టుకు వెళ్లితే వారు దీనికి భిన్నమైన తీర్పు చెప్పరని ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా? ఆనాడు విపక్షాలు, పౌరహక్కులు, మానవ హక్కుల సంఘాలు, పత్రికలు కూడా దోషి ఎవరో చెప్పాయి. కానీ వినే వారు, కనేవారు, చూసే వారు, పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదేనా మన ప్రజాస్వామ్యం.. చట్టాలు, చట్టుబండలు..!