కొండంత కష్టం కంటే గోరంత అదృష్టం ముఖ్యమని పెద్దలు చెప్పారు. ఈ విషయం సినీ రంగానికి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇక్కడ టాలెంట్ అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఆ తర్వాత పరిచయాలు, వంగి వంగి నమస్కారాలు పెట్టడాలు, పొగడ్తలతో ముంచెత్తడాలు.. అవకాశం వాదం.. వీటన్నింటినీ మించి అదృష్టం... సక్సెస్‌లు ముఖ్యం. ఒక దశాద్దం పాటు తెలుగు సినీ సంగీతాన్ని మణిశర్మ ఏలాడు. చిరంజీవి నుంచి రామ్‌చరణ్ వరకు, బాలయ్య నుంచి ఎన్టీఆర్ వరకు ఆయన సంగీతాన్నే కోరుకునేవారు. ఇక బాలయ్య, మహేష్‌లకైతే ఆయన ఆస్ధాన సంగీత విద్వాంసుడనే చెప్పాలి. కీరవాణి, దేవిశ్రీలు ఉన్నా కూడా ఆయన నెంబర్‌వన్ స్థానంలోనే కొనసాగారు. ఇక ఆయన అందించే ట్యూన్స్ కంటే ఆయన అందించే రీరికార్డింగ్ సినిమాలకు ఎంతో ఊపును తీసుకొస్తుంది. కానీ ఒక్కసారిగా ఆయన కనుమరుగయ్యాడు. ఆయనతో కలిసి నడిచిన వారు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. కేవలం ఆయన్ను ఆర్.ఆర్.కే పరిమితం చేశారు.
నేడు కీరవాణి పెద్దగా అందుబాటులో ఉండకపోవడం, దేవిశ్రీ బిజీషెడ్యూల్స్, తమన్ నిలకడలేమి, మిగిలిన యువ సంగీత దర్శకులు సత్తా చాటడంలో వైఫల్యం కారణంగా మరలా మణిశర్మ బ్యాక్ టు ఇండ్రస్టీ అనేసేలా ఉన్నాడు. 'రచ్చ' తర్వాత కనుమరుగై ఇటీవల నాని 'జెంటిల్‌మేన్'తో సత్తా చాటాడు. ఆయన ప్రస్తుతం నితిన్-హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లై' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ మోషన్‌పిక్చర్‌కి ఆయన ఇచ్చిన సంగీతం కేక పుట్టిస్తోంది. ఇక ఇంద్రగంటి తీస్తున్న 'అమీతుమీ'కి కూడా సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి మణిశర్మ మరోసారి ఓ వెలుగువెలిగేందుకు తగ్గ పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయనే చెప్పాలి.