గతంలో పాత్రికేయులంటే నేటి ఆర్.నారాయణమూర్తిలా నలిగిన తెల్లబట్టలు వేసుకొని, భుజానికి సంచి వేలాడదీసుకుని, చేతిలో పుస్తకంతో, జేబులో పెన్నుతో కనిపించేవారు. కానీ నేడు ఆధునిక యుగంలో జర్నలిస్ట్‌లు ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. నయా ట్రెండ్‌లో కనిపిస్తున్నారు. వారి నుంచి ఇతరులు కూడా నయా ట్రెండ్‌లను నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వైద్యులంటే తెల్ల కోటు, న్యాయవాదులంటే నల్ల కోటు, పోలీసులు అంటే ఖాకీ యూనిఫాం, రాజకీయ నాయకులంటే తెల్లని ఖద్దరు దుస్తులు ధరించి, చూడగానే ఆహా.. వీరు ఫలానా అని గుర్తు పట్టే విధంగా ఉంటారు.
కానీ నేడు ఎక్కడా డ్రెస్‌కోడ్ కనిపించడం లేదు. దీనివల్ల ముందుగా ఎవరో అనుకొని కోప్పడి జర్నలిస్ట్‌లపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే '2.0' సెట్‌లో ప్రెస్ ఫొటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ ఉండటం, వారు ఎవరో తెలియక యూనిట్ దాడి చేయడం జరిగింది. కాబట్టి జర్నలిస్ట్‌లు కూడా డ్రెస్‌కోడ్‌ను పాటించాలి. ఇక మహిళ జర్నలిస్ట్‌లైతే సినిమా ప్రెస్‌మీట్‌లో ఎవరు జర్నలిస్ట్? ఎవరు ఆ చిత్రంలో నటిస్తున్న కొత్త హీరోయిన్ అని కూడా గుర్తు పట్టలేని విధంగా ఉంటున్నారు.
ఇదంతా ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే... న్యాయస్థానాలకు వెళ్లేటప్పుడు డ్రెస్‌కోడ్‌ను పాటించాలని 2011లో ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ తాజాగా ఓ జాతీయ చానెల్ ప్రతినిధి జీన్స్, టీషర్ట్ వేసుకొని, కాస్త అసభ్యంగా కోర్టుకు రావడం న్యాయమూర్తికి వేదనను కలిగించింది. దీంతో న్యాయస్థానం మండిపడి జర్నలిస్ట్‌లు డ్రెస్‌కోడ్ పాటించాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. కాకపోతే వేషభాషలను చూసి మనం మోసపోకూడదని మన పెద్దలు చెప్పిన మాట కూడా వాస్తవమే.