కొందరు దర్శకులు అవకాశం రాగానే హడావుడిగా సినిమా మొదలెట్టరు. స్క్రిప్ట్ పక్కాగా సిద్దమయ్యాకే పని ప్రారంభిస్తారు. క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరున్న లెక్కల మాస్టారు సుకుమార్ ఆలోచన ఈ విధంగానే ఉంటుంది. 'నాన్నకు ప్రేమతో' తర్వాత తదుపరి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. రామ్‌చరణ్‌తో కేవలం లైన్ ఓ. కే. అయ్యాక కమిట్‌మెంట్ కోసమని జనవరి 30న పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీరో క్యారెక్టరైజేషన్ పక్కాగా ఉన్నప్పటికీ స్క్రిప్ట్ విషయంలో పూర్తి సంతృప్తి కోసం దర్శకుడు సుకుమార్ మరి కొంత గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఏప్రిల్ ఒకటవ తేదీన షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా పూడిపల్లిలో గ్రామీణ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇదే గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆపద్భాందవుడు' షూటింగ్ జరిగింది.