స్టార్ హీరోల చిత్రాలంటే చెప్పిన సమయానికి రిలీజ్ అవుతాయా? సవ్యంగా అదే రోజున ఆటంకాలు ఎదురుకాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తాయా? అనే అనుమానాలు ఎప్పటి నుంచో ఉండేవి. కానీ బాలీవుడ్‌లో మాత్రం సినిమా ప్రారంభం నాడే సినిమాల రిలీజ్ డేట్‌ను ప్రకటించే సంప్రదాయం ఎక్కువగా ఉంది. ఆ ట్రెండ్ టాలీవుడ్‌లో కూడా ఎప్పుడు వస్తుందా? అంటూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక పెద్ద చిత్రాల డేట్ ఫిక్స్ కాకపోతే దాని ప్రభావం మిగిలిన హీరోల మీద మరీ ముఖ్యంగా మీడియం రేంజ్, చిన్న చిత్రాల విడుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం లీక్ కావడం వల్ల అనివార్య పరిస్థితుల్లో ముందుగా రిలీజ్ చేశారు. ఇది మంచి విజయం సాధించింది. ఇక చిరు నటించిన 'ఖైదీనెంబర్150' చిత్రం జనవరి13న రిలీజ్ అనుకొని కూడా రెండు రోజుల ముందుగా జనవరి11నే విడుదల చేశారు. ఈ చిత్రానికి కూడా అలా రెండురోజులు ముందుకు జరపడం కలెక్షన్ల పరంగా ప్లస్ అయింది.
ఇక పవన్ నటించిన 'కాటమరాయుడు'ను ఉగాది కానుకగా మార్చి29న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ వారం ముందుగానే 24న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి డివైడ్‌టాక్ వచ్చినా కూడా లాంగ్ వీకెండ్‌తో పాటు ఉగాది కూడా కలిసిరావడం చిత్రానికి వసూళ్ల పరంగా ప్లస్ అయింది. ఇప్పటికే ఆలస్యమైన వెంకటేష్ 'గురు' చిత్రాన్ని ఏప్రిల్7న రిలీజ్ అని భావించి కూడా ఒక వారం ముందుగా మార్చి31న విడుదల చేశారు. తాజాగా మరో మెగాహీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న 'మిస్టర్'ను ఏప్రిల్14 న కాకుండా ఒకరోజు ముందుగా అంటే ఏప్రిల్13నే రిలీజ్ చేయనున్నారు. 'కంచె' విషయంలో కూడా ఇదే జరిగింది. మొత్తం మీద ఈ ట్రెండేదో బాగానే వర్కౌట్ అవుతున్నట్లుగా ఉంది.