పవన్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు అనే జోడెద్దుల సవారీ చేస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన సన్నిహితులు, అభిమానులు, ఆయన సోదరులు కూడా పవన్‌కి ఆ సామర్ధ్యం ఉందని చెబుతున్నారు.. నమ్ముతున్నారు. కానీ బాగా పరిశీలిస్తే ఇది పెద్దగా సక్సెస్‌ఫుల్‌గా జరగడంలేదనే భావించాలి. ఆ మద్య పవన్ మాట్లాడుతూ, తాను ఏ పని ఇచ్చినా, చివరకు వీధులు ఊడ్చే పని ఇచ్చినా కూడా చిత్తశుద్దితో, మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పాడు. కానీ ఆయన 'సర్దార్‌గబ్బర్‌సింగ్', 'కాటమరాయుడు' చిత్రాలను చూస్తే అది నిజం అనిపించడం లేదు. ఆయన పూర్తిగా స్క్రిప్ట్‌ను స్టడీ చేస్తున్నాడా? లేదా? రషెష్ చూసుకుంటున్నాడా? లేక తానేం చేసినా ప్రజలు చూస్తారని భావిస్తున్నాడా? అనేది అర్థం కావడం లేదు.
'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రంలోని పాటల్లో కొన్ని సార్లు ఆయన లిప్ మూమెంట్ కూడా సరిగా ఇవ్వలేదు. 'కాటమరాయుడు' చిత్రాన్ని చూస్తే కూడా అదే అభిప్రాయం కలుగుతోంది. మరోపక్క రాజకీయంగా సమస్యలపై స్పందిస్తూ, న్యాయనిపుణుల సలహాలను, నిష్ణాతుల సలహాలను తీసుకుంటానని ఆయన చెబుతున్నాడు. కానీ ఓ విమర్శ లేదా ఓ సంఘటనపై స్పందించే ముందే ఆయన నిష్ణాతుల సలహాలు తీసుకోవాలి. అంతేగానీ సమస్య కోసం పోరాటం చేస్తూ, ఇంకా ఈ విషయం గురించి అధ్యయనం చేయాలి... అనేది ఆయన పెద్దమనసును సూచిస్తుందే గానీ అనవసరంగా ఆయన శత్రువులకు అది ఆయుధంగా మారుతుంది.