మొన్న ఇళయరాజా... నిన్న కీరవాణి.. ఏమైంది వీళ్లకి...? తాజాగా కీరవాణి చాలా మంది దర్శకులను బుర్రలేని వారు అనడం, వేటూరి, సిరివెన్నెల స్థాయి సాహిత్యం కనుమరుగవుతోందని చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇంకా రగులుతూనే ఉంది. రామజోగయ్యశాస్త్రి అయితే ఐఫా వేదికపైనే మంచి సందర్బం ఇస్తే మంచి పాట రాయగలమని.. చెత్త సందర్భానికి సిరివెన్నెల కూడా చెత్తగానే రాస్తారని వాగ్బాణాలు వదిలారు. ఇక భాస్కరభట్ల మరో అడుగు ముందుకేసి వేటూరి, సిరివెన్నెల తర్వాత అంత గొప్పగా రాయగలిగింది కీరవాణినేనని, ఆయన తన సొంత సంగీతం అందించే చిత్రాలకే కాకుండా బయటి చిత్రాలకు కూడా పాటలు రాయాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఇక పలువురు గతంలో కీరవాణి అందించిన సాహిత్యంలోని, సంగీతంలోని తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఇక తన కెరీర్ మొదట్లో 'మనసు మమత', సుమన్ 'ఆత్మబంధం', అక్కినేని 'సీతారామయ్యగారి మనవరాలు' వంటి చిత్రాలకు చిన్నా పెద్దా తేడా లేకుండా కీరవాణి అందరికీ మంచి సంగీతం అందించారు. కానీ ఒక్కసారి స్టార్‌స్టేటస్ రాగానే రాఘవేంద్రరావు, రాజమౌళిలకు తప్ప మరెవ్వరికి మనసు పెట్టి సంగీతం అందించలేదనేది వాస్తవం. ఆయన సినీ కెరీర్ మొదటి నుంచి ఆయన్ను ఫాలో అవుతున్న వారు ఇదే చెబుతారు. ఇకపై కూడా కీరవాణి.. రాఘవేంద్రరావు, రాజమౌళిలకు మాత్రమే పనిచేసే వీలుంది. ఆయన దృష్టిలో వారిద్దరే బుర్రన్న దర్శకులు అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.