జీవితంలో పడటం ఎంత సహజమో అందరికీ తెలిసిందే. కానీ పడిన తర్వాత గోడకు కొట్టిన బంతిలా తిరిగి లేవడం అంత సులభం కాదు. అయినా ఒకటి రెండు సార్లు పట్టుదలతో అలా లేవవచ్చు. కానీ పూరీ జీవితంలో ఎన్నోసార్లు పడ్డాడు. పడిన ప్రతిసారి కెరటంలా మరలా దూసుకొచ్చాడు. పూరీ నిజంగా పాజిటివ్ థింకర్, ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు కరెక్ట్ టైంనే చూపిస్తుందని ఆయన చెప్పే మాటలే అందుకు ఉదాహరణ.
కానీ పూరీ గత కొంతకాలంగా తీవ్ర వైఫల్యాలను ఎదుర్కొంటున్నాడు. ఈమధ్య కాలంలో ఆయన తీసిన 'జ్యోతిలక్ష్మి, లోపర్, ఇజం' వంటి చిత్రాలు చూసిన వారు మాత్రం ఇక పూరీ తిరిగిలేచే అవకాశం లేదన్నారు. ఇటీవలి కాలంలో ఫర్వాలేదనిపించిన చిత్రం 'టెంపర్' మాత్రమే. ఇక పూరీ ఒకసారి కథ చెబితే చాలు అనుకున్న హీరోలు కూడా.. జగన్ స్టోరీ చెబితే ఎలా తప్పించుకోవాలా? అని చూస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు చిరు, వెంకీ, మహేష్, ఎన్టీఆర్ వంటి హీరోలు హ్యాండిచ్చారు. కానీ పూరీ మాత్రం బాలయ్యను ఓకే చేయించుకొని మరోసారి రంగంలోకి దూకాడు.
ఈ చిత్రం తర్వాత తాను వెంకీతో, మరలా చిరంజీవితో చిత్రాలు చేస్తానని ఢంకా భజాయించి చెబుతున్నాడు. ఇక ఆయన బాలయ్యతో చేస్తున్న చిత్రానికి 'ఉస్తాద్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఇది గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని, ఇందులో బాలయ్య మాఫియా డాన్ అని పూరీ స్వయంగా తెలిపాడు. దీంతో ఈ చిత్రం ఆయన మహేష్‌తో చేయాలని భావించిన 'బిజినెస్‌మేన్2' అనే ప్రచారం అప్పుడే మొదలైంది....!