జీవితంలో చావు అనేది అతి పెద్ద బాధాకర విషయం. ఇక మన భారతదేశంలో చావును చాలా సెంటిమెంట్‌గా భావించి, ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. కేవలం సిగరెట్ ప్యాకెట్ల మీద పుర్రె గుర్తును వేయాలని ప్రభుత్వం భావిస్తే చివరకు ఆ అలవాటు లేని వారు కూడా దానిని ఖండించారు. చాలా మంది పొగరాయుళ్లు తమ జేబుల్లో కూడా సిగరెట్ ప్యాకెట్లను పెట్టుకుంటారు కాబట్టి ఆ నిర్ణయం తప్పని ముక్తకంఠంతో వాదించారు.
కాగా ఈమధ్య ఎవరిపైనైనా కోపం వస్తే పిండ ప్రదానం చేయడం, శవయాత్ర చేయడం, చితికి నిప్పటించడం, శ్రద్దాంజలి ఘటించడం వంటివి చేస్తున్నారు. కానీ ఇది భారతీయుల సెంటిమెంట్ అని, అలా నిరసన తెలపడం ప్రజాస్వామ్య బద్దమే అయినా అది మంచి సంప్రదాయం కాదని, కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాజకీయ నాయకులకు, ప్రజలకే కాదు.. అందరికీ కోర్టులు సూచించాయి. ఇక వర్మకి పవన్ ఫ్యాన్స్‌కి జరుగుతున్న ట్వీట్ల యుద్దం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. వర్మ ఆకస్మికంగా మరణించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ కొందరు పవన్ ఫ్యాన్స్ వర్మ ఫొటోకు పూల దండవేసి, దీపం వెలిగించి, శవయాత్ర చేస్తున్నట్లు ఫొటోను పెట్టి, శ్రద్దాంజలి, నివాళి వంటి పదాలతో సంతాపం ప్రకటిస్తు ట్వీట్ చేస్తున్నారు. ఇది పైత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
ఫ్యాన్స్ మరీ ఇంత వింత పోకడలు పోవడం సమంజసం కాదు. దీనికి వర్మ 'లవ్ యు స్వీట్ డార్లింగ్స్... లవ్లీ బ్యూటిఫుల్ పీకే ఫ్యాన్స్... మీ అందరికీ గాఢమైన ఆలింగనం.. చదువురాని గోర్రెలకు అర్ధం కావడంలేదు. నేను ఇప్పటికే మూడు జన్మలు ఎత్తి మరణించాను. ఇప్పుడు దెయ్యం రూపంలో ఉన్నాను. దెయ్యాలు ఇక మరణించవు. ఎందుకంటే అవి జీవితాంతం మరణదశలోనే ఉంటాయి...' అని ట్వీట్ చేశాడు. ఇక ఇప్పటికైనా వర్మ, పవన్ ఫ్యాన్స్ ఇద్దరూ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడతారో లేదో చూడాలి...!