నేడు మన సీనియర్ స్టార్స్ నుండి యంగ్ హీరోల వరకు అందరూ రెండు మూడు భాషలను టార్గెట్ చేస్తూ తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే. నిర్మాతకు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీంతో రానా, సాయిరాం శంకర్ నుంచి అందరూ పరాభాషా నటీనటులతో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. మహేష్‌బాబు - మురుగదాస్‌ల చిత్రం విషయంలో నటీనటుల నుంచి సంగీత దర్శకుని దాకా పరభాషా వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
'బాహుబలి'లో ప్రభాస్‌కు తోడుగా సత్యరాజ్, సుదీప్, రానా, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్.. వంటి వారు నటించడం ప్లస్ అయింది. దాంతో ప్రభాస్ ,సుజీత్‌తో చేసే చిత్రంలో విలన్లుగా వివేక్ ఒబేరాయ్, జాకీష్రాఫ్‌ల నుంచి హీరోయిన్ కోసం కూడా బాలీవుడ్ వారిపై కన్నేశాడు. ఇక సంగీత దర్శకునిగా శంకర్-ఇహసాన్-లాయ్‌లను ఎంచుకున్నాడు.
రజనీ చేసిన సినిమాలలో ఐశ్వర్యారాయ్, దీపికా పడుకోనే, సోనాక్షిసిన్హా వంటి వారు ఉంటారు. తాజాగా '2.0'లో అక్షయ్‌కుమార్ నటిస్తున్నాడు. ఇక పలు చిత్రాలలో మోహన్‌లాల్, సుదీప్, శరత్‌కుమార్, అర్జున్ వంటి నటీనటులకు డిమాండ్ పెరుగుతోంది. చిరు సైతం రజనీ స్టైల్‌లో త్వరలో చేయబోయే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలో కీలకపాత్రకు అక్షయ్‌కుమార్‌ని తీసుకోనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇక పలు భాషల్లో గుర్తింపు ఉన్న ఉపేంద్ర, రమ్యకృష్ణ, నాజర్ వంటి వారు ఎప్పుడూ బిజినే అన్నసంగతి తెలిసిందే.