ఒక్క బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం తెలుగు వారి గొప్పదనం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దానికి ఒక్క రాజమౌళి మాత్రమే కాదు.... అందులో నటించిన నటీనటులు, ఆ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ వరకు అందరూ అంతటి పేరును మోస్తున్నారు ఈరోజు. అంతటి బాహుబలి ప్రాజెక్ట్ లో ఐదేళ్ల నుండి జర్నీ చేసిన ప్రతి ఒక్కరు.. ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన బాహుబలి ద కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఇంతటి పెద్ద ఈవెంట్ ని రాజమౌళి అండ్ టీమ్ ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి నిజంగా అదరహో అనిపించారు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుండి బాహుబలికి సంబంధం లేని వారు ఒక్కరు మాత్రమే పాల్గొన్నారు. ఆయనే ప్రభాస్ పెదనాన్న కృష్ణమ్ రాజు. ఆయన ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ... ఒకప్పుడు ఇండియాలో ఒకే ఒక్క కథతో ఇన్ని సంవత్సరాలు కొన్ని వేల సినిమాలు ఎలా తీశారు అంటూ స్పీల్బర్గ్ అనే వ్యక్తి ఎద్దేవా చేసాడు. ఇప్పుడు ఆయన్ని ఒకసారి బాహుబలి చిత్రాన్ని చూసి కామెంట్ చెయ్యమనండని.. మనవాళ్ళు అంటున్నారని చెప్పారు.
డైరెక్టర్ రాజమౌళి స్పీల్బర్గ్ అంతటి గొప్పవాడా.. అని నేను అనను.. అంతకంటే గొప్పవాడు అవుతాడేమో.. . నాకు తెలియదుగాని ఇండియన్ మరియు తెలుగు సినిమాలో చాలా గొప్ప ఫిలింమేకర్లు ఉన్నారని రాజమౌళి నిరూపించడం నాకు గర్వంగా ఉందని అన్నారు. అలాగే రాజకీయనాయకులు కూడా ఇప్పుడు బాహుబలి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని... మన ప్రధాని మోడీ కూడా బాహుబలిలో కట్టప్ప గురించి మాట్లాడుతున్నారని... మన సినిమాల స్థాయి ఏ విధంగా పెరిగిందో చూసారా...అంటూ బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు కృష్ణం రాజు.