తాజాగా ఏపీ బిజెపి ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మిత్ర పక్షమైన టిడిపిపై మండిపడ్డాడు. రాజధాని కోసం జపాన్, సింగపూర్ అని హంగామా చేస్తున్నారని, నయా రాయపూర్‌ను కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్‌బోర్డే నిర్మించిందని, ఇప్పటికే వెలగపూడిలో కట్టిన సచివాలయం, అసెంబ్లీల స్థానంలో డబ్బును దుబారా చేసి మరలా కట్టడమెందుకని మండిపడ్డాడు. ఆయన ఆవేదన వింటుంటే వైసీపీ చంద్రబాబు విషయంలో చేస్తున్న బాహుబలి-3 గ్రాఫిక్స్ విమర్శలు నిజమేననిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చెబుతూ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బిజెపి గెలిచిందని, కానీ టిడిపి నాయకులు తమ వల్లనే బిజెపి గెలిచిందంటున్నారని, అలా అయితే మిగిలిన చోట్ల టిడిపి ఎందుకు ఓడిపోయిందని అసలు ప్రశ్నను చంద్రబాబు ముందుంచాడు.
తాము మోదీ ఫొటోతో ఎన్నికలకు వెళ్లి గెలిచామని, టిడిపి చంద్రబాబు ఫొటోతో వెళ్లి ఓడిపోయిందని ఎద్దేవా చేశాడు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టిడిపి.. బిజెపిని కరివేపాకులా చూస్తోందన్నాడు. ఇక్కడ మాత్రం సోము వీర్రాజు ఓ విషయం గుర్తుంచుకోవాలి. కేంద్రంలో బిజెపి, మోదీ పూర్తి మెజార్టీ సాధించడంతో టిడిపితో పాటు ఇతర ఎన్డీఏ పార్టీలను కరివేపాకులా చూస్తున్నారు. ఆ లెక్కన కిందటి ఎన్నికల్లో టిడిపి, బిజెపిలు.. పవన్ సాయంతో గెలిచి పూర్తి మెజార్టీ రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో బిజెపిని టిడిపి కరివేపాకులా చూస్తోంది. ఈ సామెత టిడిపికే కాదు.. బిజెపికి కూడా వర్తిస్తుందనే చెప్పాలి...!