సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత మన ఇండస్ట్రీలో కూడా మార్పు వచ్చింది. చాలా మంది నోరు విప్పి నిజాలు చెబుతున్నారు. తాజాగా 'మా' అద్యక్షునిగా ఎంపికైన శివాజీరాజా కూడా అదరగొడుతున్నాడు. పరిశ్రమలోని లుకలుకలను ఎత్తి చూపుతున్నాడు. రంగనాథ్ చనిపోయినప్పుడు ఆయన భౌతికదేహాన్ని 'మా' కార్యాలయానికి తెస్తే తనతో మండిపడిన సీనియర్‌ను చెప్పుతో కొడతానన్నాడు. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు రంగనాథ్ ఎంతో బాధపడ్డాడని తెలిపాడు. దీంతో పరోక్షంగా ఆయన ఏమి చెప్పదలుచుకున్నాడో దానిని చెప్పేశాడు. మోహన్‌బాబు.. పరిటాల రవితో కలిసి తనతో మాట్లాడిన విషయాన్ని చెప్పడం ద్వారా పరిటాలతో మోహన్‌బాబు సంబంధాలను కూడా ప్రస్తావించాడు. మోహన్‌బాబు-పరిటాలలు కోపంగా ఉండి తనకు ఫోన్ చేసినప్పుడు స్వర్గీయ శ్రీహరి తనకు ఫోన్ చేసి, పరిస్థితి సీరియస్‌గా ఉంది రావద్దని చెప్పాడని అన్నాడు.
ఇక మోహన్‌బాబు తనను చిరంజీవి తొత్తు అన్నాడని, తాను చిరంజీవి ఫ్యామిలీతో, మోహన్‌బాబు ఫ్యామిలీతో సినిమాలు చేయలేదని, కేవలం నాగబాబుతోనే చేశానని చెప్పాడు. తన తల్లిదండ్రులు తనపై కోర్టుకి ఎక్కడం వెనుక ఓ పెద్ద మనిషి ఉన్నాడని, అలాంటి పనులు చేసినందు వల్లే ఆయన త్వరగా దేవుని వద్దకు వెళ్లాడని వ్యాఖ్యానించాడు. ఇక బ్రహ్మానందం ట్రస్ట్‌తో తన గొడవను, నిధులు దుర్వినియోగంను తెరపైకి తెచ్చాడు. మురళీమోహన్ పట్ల తాను తప్పుగా మాట్లాడానని తప్పు ఒప్పుకున్నాడు. తన చేతిలో ఓడిపోయిన తర్వాత అలీనే తనతో మాట్లాడటం లేదని చెప్పేశాడు. మొత్తానికి శివాజీ రాజా కూడా నిజమైన మగాడనిపించుకుంటున్నాడు.