'సర్దార్ గబ్బర్‌సింగ్' వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత కూడా పవన్ వాస్తవాలు గ్రహించలేదని 'కాటమరాయుడు'తో స్పష్టమవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఇక ఓ తమిళ డబ్ చిత్రం కథను రీమేక్ చేయడం ఏమిటి? తెలుగులో సత్తా కలిగిన దర్శకులు, రచయితలు లేరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్ పస లేని ఇలాంటి చిత్రాలు చేసే కంటే కనీసం మంచి ప్రశంసలు పొంది, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయిన 'జానీ' వంటి చిత్రాలు చేస్తేనే ఆయన పరువు నిలబడుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్‌కి అంతగా ఉంటే తానే 'సత్యాగ్రహి' వంటి చిత్రాలను పట్టాలెక్కించాలని వారు కోరుతున్నారు. సరైన కథలే లేనట్లు 'వీరుడొక్కడే'ని రీమేక్ చేయాల్సిన అవసరం లేదని, ఎందరో యంగ్ టాలెంటెడ్ దర్శకులు, రచయితలు పవన్ కోసం మంచి మంచి కథలను తయారు చేసి ఆయన్ను ఎలా కలవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శకులు చెబుతున్నారు.
సినిమా జయాపజయాలను పవన్ పట్టించుకోలేకపోవచ్చు గానీ, ఆయన అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రం సక్సెస్ చిత్రాలను, లాభాలను కోరుకుని కాలర్ ఎగరేయాలని కోరుకుంటారు? కదా..! అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో వర్మ వంటి వారికి ఇది ఆయుధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు వర్మ పవన్‌ని, ఆయన అభిమానులను మరోసారి తన ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలతో ఆడుకున్నాడు. ఇక పవన్ ఈమధ్య ఎక్కువగా చేనేత దుస్తులను, మరోపక్క 'కాటమరాయుడు' చిత్రంలో పూర్తిస్థాయి పంచెకట్టుతో, చేనేత దుస్తులనే ధరించడాన్ని, ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కూడా అలాగే వచ్చి చేనేత వస్త్రాలకు ఇన్‌డైరెక్ట్‌గా తన ఫ్యాన్స్‌లో కూడా ఆదరణ చూపేందుకు ప్రయత్నిస్తుండటం.. మాట ఇచ్చినట్లుగా డాలీ, అనూప్‌లకు రెండో అవకాశం ఇవ్వడంపై ప్రశంసల జల్లులు కూడా కురిపిస్తున్నారు.