సీనియర్ నటులు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇటీవల వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన 'బాహుబలి'లో ఏమి లేదని తేల్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150', నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సత్యనారాయణను అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ..చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని చూసేందుకు నన్ను పిలవలేదు. దాంతో ఆచిత్రాన్ని చూడలేదు.
కానీ ఈ విషయంలో బాలకృష్ణ ఫర్వాలేదు. తాను నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' షోకు నన్ను స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. దాంతో ఆ చిత్రం చూశాను. ఇక 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని థియేటర్‌లో కూడా చూడలేదు. ఆ జనాలు, గోల మధ్య చూడటం నాకిష్టం లేదు... అని కుండబద్దలు కొట్టారు. ఇక పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల్లో సినీ పెద్దలకు స్వయంగా ఓ షో వేసి పిలిచేవారని, కానీ ఆ సంప్రదాయం హైదరాబాద్‌కి మారిన తర్వాత లేదన్నారు.
ఇక టాలీవుడ్‌లో ఎంత నటులైనా సరే సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉంటే వారిని పట్టించుకోరని, అప్పుడు క్రేజ్ ఉన్న కొత్త ఆర్టిస్టులకు ఇచ్చే పాటి గౌరవ మర్యాదలు కూడా సీనియర్లకు ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి కైకాల సత్యనారాయణ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సంచలనాలను రేకెత్తిస్తున్నాయి.