తాజాగా విడుదలైన 'కాటమరాయుడు' చిత్రం అజిత్ నటించిన 'వీరం' ఆధారంగా తెరకెక్కింది. ఆల్‌రెడీ ఇప్పటికే తెలుగులో కూడా 'వీరం'ను డబ్ చేసి విడుదల చేశారు. చూసిన కథ, చూసిన చిత్రమే అయినా కూడా ఈ చిత్రానికి తెలుగు వారిలో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సరే పవన్‌కు తెలుగు నాట బాగా క్రేజ్ ఉండటంతో స్టార్స్ చిత్రాలకు ఇది సహజమేనని భావించవచ్చు. ఇక కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీఎత్తున రిలీజ్ అయింది. అయితే పవన్ బహుభాషా నటుడు కాదు. ఆయన హవా కేవలం తెలుగు వారికే సొంతం. తమిళంలో అజిత్, విజయ్‌ల కోవకు ఆయన వస్తాడు.
'సర్దార్ గబ్బర్‌సింగ్'తో ఆయన బాలీవుడ్‌తోపాటు పలు వుడ్‌లలో ట్రై చేసి సక్సెస్ కాలేకపోయాడు. దాంతో 'కాటమరాయుడు' విషయంలో అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. ఇక 'వీరం' చిత్రం తమిళ్‌లో పెద్ద హిట్. అయినా కూడా 'కాటమరాయుడు' చిత్రం తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళనాడులో ఈ చిత్రం దాదాపు 800 స్క్రీన్లలో రిలీజ్ అయింది. అక్కడి లోకల్ హీరోల చిత్రాలకు కూడా అన్ని థియేటర్లు దొరకవు. స్టార్స్‌కి మాత్రమే అక్కడ అన్ని థియేటర్ల దొరుకుతాయి. ఇక చెన్నైలోనే 'కాటమరాయుడు' చిత్రం దాదాపు 180 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఒక్క పీవీఆర్ థియేటర్స్‌లోనే మొదటి రోజు 58 షోలు వేస్తున్నారు.
గతంలో రజనీ నటించిన 'కబాలి' చిత్రం అదే థియేటర్లలో మొదటి రోజు 62 షోలు వేశారు. ముఖ్యంగా పలు ఆటో డ్రైవర్లు తమ ఆటోల వెనుక పవన్ పోస్టర్స్ తగిలించుకున్నారు. అనూహ్యంగా ఈ చిత్రం కోసం అజిత్ అభిమానులు ముందుకొచ్చి పవన్‌కి బ్యానర్స్ కట్టారు. దీంతో అజిత్ కూడా పవన్ హవా చూసి షాకయ్యాడట.