తాజాగా కర్ణాటక అసెంబ్లీలో కొందరు మీడియా వారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వారు కొందరు మంత్రులను, ఎమ్మెల్యేలను కించపరుస్తూ, సెన్సేషన్ కోసం, టిఆర్పీల కోసం పాకులాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక కొందరు జర్నలిస్ట్‌లు, మీడియా అధిపతులు కోట్లకుకోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని, తమకు నీతులు చెప్పేముందు వారు తమ సొంత విషయాల గురించి కూడా ఆలోచించాలని, కొందరు మీడియా వారు తమ వృత్తిలోకి ప్రవేశించకముందు ఎంత సంపాదించారు? ప్రస్తుతం వారి సంపాదన ఎంత? అనే విషయాల గురించి కమిటీ వేయాలని సూచించారు. వారి ఆవేదనలో అర్దం ఉంది.
కానీ మీడియా వక్రంగా మారడానికి నేటి నాయకులు, అధికారపార్టీలు మీడియాను ప్రసన్నం చేసుకోవడం కోసం చేస్తున్న, ఆశ చూపుతున్న పలు విషయాల్ని కూడా మనం మరువలేం. నిజాయితీగా బతికే పాత్రికేయులు, ప్రాణాలనర్పించిన వారు కూడా ఉన్నారు. ఇక ఎంతో సీనియర్ నాయకుడైన రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సభలో ఎంతో కీలకమైన ఎన్నికల ప్రక్షాళన గురించిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఒకరిపై ఒకరు చేసిన వ్యాఖ్యలను మాత్రమే హైలైట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. మొత్తానికి ఈ విషయంలో మాత్రం అందరూ దొంగలేనని ఒప్పుకోవాలి...!