నేడు నిర్మాతలలో కూడా ధైర్యం బాగా పెరిగింది. తమ సినిమాలలో దమ్ముంటే ఎంత పెద్ద చిత్రం వచ్చినా కూడా తమకు భయం లేదంటున్నారు. పైగా పెద్ద చిత్రాల సమయంలో వాటిని రిలీజ్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయనేది వాస్తవం. కాగా ఉగాది పండగకు పవన్ ఈరోజు నుండే తన 'కాటమరాయుడు'తో పోటీ మొదలుపెట్టాడు. దాంతో చాలామంది ఈ చిత్రాన్ని చూసి తమ చిత్రాల విడుదలలో వెనక్కి వెళ్లతారని భావించారు.
కానీ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన 'రోగ్' కూడా విడుదలకు సిద్దమైంది. మరోపక్క తమిళంలో నయనతార ప్రధానపాత్రలో నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ 'డోరా' కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకు రెడీ అయింది. దాస్ రామస్వామి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రమైనా కూడా హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం కావడంతో 'డోరా' కూడా కొందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం.
ఇక పెద్ద చిత్రాలంటే పోస్ట్‌పోన్ అవుతుంటాయనే పేరుంది. కానీ పవన్ 'కాటమరాయుడు' ముందు అనుకున్న దాని కంటే ఒక వారం ముందుగా రిలీజైంది. ఇదే తరహాలో వెంకటేష్, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించిన 'సాలా ఖద్దూస్' రీమేక్ 'గురు'ని కూడా ఓ వారం ముందుగానే థియేటర్లలోకి తేవడానికి రెడీ అవుతున్నారు. విభిన్నకథా చిత్రం కావడం, మరీ ముఖ్యంగా మంచి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం కావడంతో ఈ చిత్రం కూడా అలరించడం ఖాయమంటున్నారు. సో.. ఈ ఉగాది మనకు మంచి విందు భోజనం పెడుతుందనే చెప్పవచ్చు.