నేడు దేశంలో ప్రైవేట్ ఆర్దిక కార్యకలాపాలు నడిపే సంస్థలు ప్రజల బలహీనతలను ఉపయోగించుకొని చేస్తున్న ఆర్థిక నేరాలు అన్నీఇన్నీ కావు. ఆర్బీఐ, సెబీతో పాటు పలు చట్టాలలోని లొసుగులను తెలివిగా క్యాష్ చేసుకుంటూ పేద ప్రజలకు కుచ్చుటోపీలు పెడుతున్నాయి. బ్యాంకులు మధుపరులకు ఇచ్చే వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉండటంతో కాస్త ఎక్కువ వడ్డీకి సామాన్యులు ఆశపడుతున్నారు. తమ రోజు వారి సంపాదనను, పొదుపులను ఈ సంస్థల్లో పెడుతున్నారు. కృషి బ్యాంకు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని శారదా చిట్‌ఫండ్స్ వరకు, అగ్రిగోల్డ్, సిరి గోల్డ్, అక్షయ గోల్డ్ వంటి సంస్థలు, చిట్‌ఫండ్స్ ఎందరినో నిలువునా మోసం చేస్తున్నాయి. జీవితాంతం కూడబెట్టిన సొమ్మును, ఉద్యోగానంతరం వచ్చిన మొత్తాలను కూడా సామాన్యులు దానిలో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇవి బోర్డ్ పీకేసిన తర్వాత ఏజెంట్లు, నిర్వాహకులు అందరూ లాభపడుతున్నారే గానీ పేదలు రోడ్డున పడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా అగ్రిగోల్డ్ వల్ల మోసపోయిన వారు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నారు. రామోజీరావు ఇప్పటివరకు ఎవ్వరికీ డబ్బు ఎగ్గొట్టనప్పటికీ ఆయన నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్స్‌లోని కార్యకలాపాలు చట్టవ్యతిరేకమంటూ ఉండవల్లి సాక్ష్యాలతో సహా నిరూపించాడు. ఇక వీటి వల్ల సామాన్యులు రోడ్డున పడుతున్నారేగానీ పెద్దలు మాత్రం మోసపోయినవారిలో ఒక్కరు ఉండరు. ఈ సంస్థలను కొందరు నాయకులే బినామీలుగా శాసిస్తున్నారు. ఇక అగ్రిగోల్డ్ విషయంలో వైసీపీ, కాంగ్రెస్‌లు బాగానే స్పందిస్తున్నాయి. కానీ అగ్రిగోల్డ్ సంస్థకు వైఎస్ సీఎంగా ఉండగానే బీజాలు పడ్డాయి. ఆయన ఈ సంస్థ నిర్వాహకులకు ఉత్తమ వ్యాపారవేత్తలుగా పలు అవార్డులు కూడా ఇచ్చాడు. దీంతో నిర్వాహకులు అమాయకులను వైఎస్ అవార్డులనందిస్తున్న ఫొటోలతో, పబ్లిసిటీలతో మోసం చేశారు. ఏదిఏమైనా అగ్రిగోల్డ్ వంటి సంస్థలపై కఠిన చర్యలకు చంద్రబాబు నడుం బిగించడం హర్షణీయం...!