రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచిందని, తెలుగు సినిమాకు ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిందనే వారు ఎందరో ఉన్నారు. సాహో బాహుబలి, జయహో జక్కన్న అనే వారు ఎందరో ఉన్నారు. అయితే ప్రపంచంలో తెలుగు చిత్రాలకు ఎప్పుడో గొప్ప గుర్తింపు ఉందని, ఎస్వీరంగారావు, ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి వంటి వారికి విదేశాలలో కూడా ఎంతో గుర్తింపు ఉందని, తెలుగుసినిమా అంటే ఎమోషన్స్, నీతిని చెప్పే చిత్రాలేనని అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే.. బాహుబలి చిత్రం ఏ విషయంలో గొప్ప? అని విమర్శించే వారు కూడా ఎందరో ఉన్నారు.
ఇటీవల సీనియర్ నటి జమున 'బాహుబలి' తో ఓ ఆటాడుకుంది. ఇప్పుడు సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. 'బాహుబలి'ని అందరూ చూసి ఉంటారు. నేనూ చూశాను. అందులో ఏమి గొప్పతనం ఉందో ఎవరైనా చెబుతారా? గొప్ప గొప్పసెట్లు, గ్రాఫిక్స్ ఉంటే అది గొప్ప చిత్రమైపోతుందా? కోట్లు ఖర్చుపెడితే మన సినిమా స్థాయి పెరుగుతుందా? 500కోట్లతో 500 మంచి చిత్రాలను తీయవచ్చు. సినిమా అంటే ఏదో ఒక నీతి, మంచి చెప్పాలి. ఇటీవల విడుదలైన 'బిచ్చగాడు'తో పాటు పలు చిత్రాలలో నీతి ఉంది. సందేశం ఉంది. బాహుబలిలో ఏమైనా కథ ఉందా? ఈ కథను మూడు వ్యాక్యాల్లో చెప్పగలం.
మంచి సంభాషణలు, వీనుల విందైన, ఆహ్లాదకర సంగీతం వంటివి ఉన్నాయా? ఇక యుద్ద సన్నివేశాల గురించి చెప్పుకుంటే ఏ సాంకేతికత లేని ఆ రోజుల్లోనే విఠలాచార్యగారు ఇంత కంటే గొప్పగా పోరాటాలను తీశారు. వాటిని అప్పుడు ట్రిక్స్ అన్నారు. ఇప్పుడు గొప్పగా ఖర్చుపెట్టి గ్రాఫిక్స్ అంటున్నారు. అంతే తేడా...అని 'బాహుబలి' గొప్పతనాన్ని మూడు మాటల్లో తేల్చేశారు.