ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం, ఇళయరాజాల మధ్య 'ఎందుకు పాడావ్' అనే వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలువురు పెద్దలు స్పందిస్తున్నారే గానీ ఈ వివాదాన్ని పరిష్కరించేది ఎలా? ఇద్దరినీ కలపాలనే ఆలోచన మాత్రం ఎవ్వరు చేయడం లేదు. కానీ ఎట్టకేలకు తెలుగు, తమిళ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎస్పీబాలుగారు అమెరికాలో కచ్చేరిలు చేస్తున్నారని, ఆయన ఇండియా తిరిగి రాగానే ఇళయరాజాకు తమిళ చిత్ర పరిశ్రమ తరపున ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, ఆ వేడుకలో బాలుగారి కచ్చేరి ఉంటుందని స్పష్టం చేశాడు.
అంతేగాక మాటలతో సరిపెట్టని విశాల్ ఈ విషయం గురించి తాను ఇళయరాజా, ఎస్పీబాలు ఇద్దరితో స్వయంగా ఫోన్‌లో మాట్లాడానని తెలిపాడు. మరోవైపు బాలు అమెరికాలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇళయరాజా గారి పాటలు తెలియక పాడాను. నా అదృష్టం కొద్ది నేను మరికొందరు మంచి సంగీత దర్శకుల పాటలు కూడా పాడాను. ఇకపై వారి పాటలు పాడుతానే గానీ ఇళయరాజా గారి పాటలు మాత్రం ఇక పాడనని ఉద్వేగానికి లోనయ్యారు.