ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న జెసి దివాకర్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పులివెందులలో పోటీ చేయడానికి తన దగ్గర బాంబులు స్టాక్‌లేవని, కాబట్టి పోటీచేయనన్నాడు. అదే సమయంలో బాంబులు అంటే వేరే అర్థం చేసుకోవద్దని, బాంబులు అంటే 'దుడ్దు' (డబ్బు) లేదని, పులివెందులలో పోటీ చేయాలంటే అవి ఎక్కువగా కావాలని జగన్‌ని టార్గెట్ చేశాడు.
ఇక జగన్ బిజెపి వంటి జాతీయ పార్టీలో తన పార్టీని విలీనం చేసే అవకాశం ఉందంటూనే.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే జగన్ ఆ పని చేస్తాడన్నారు. కానీ బిజెపి చంద్రబాబు నాయుడును వదులుకుంటుందా? అనేది ఆసక్తికరమని వ్యాఖ్యానించాడు. ఇక జనసేన గురించి మాట్లాడుతూ, అది ఇంకా పిల్ల పార్టీ అని, దాని పరిధి చాలా తక్కువని, ఆ పార్టీ ఇంకా ముద్రగడ పద్మనాభం చుట్టూనే తిరుగుతోందని, దాని నుంచి బయటకు రావాలన్నాడు. ఇక లోకేష్‌ను మంత్రిని చేస్తే తప్పేంటని ప్రశ్నించాడు.
కానీ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. జగన్‌తో పులివెందులలో నిలవాలంటే బాంబులు (డబ్బులు) దండిగా కావాలని వ్యాఖ్యానించడంతో వైసీపీ, వైసీపి బిజెపిలో కలుస్తుందా? అన్న దానిపై బిజెపిలు జెసి వ్యాఖ్యలను తప్పు పడుతున్నాయి. ఇక పలు కేసుల్లో, ఆర్థిక నేరాలలో, నేరచరిత్రలో ముందుండే జెసీ సోదరులు నీతులు చెప్పడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు.
మరోపక్క పవన్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పిన తర్వాత అదే జిల్లాకు చెందిన జెసి.. పవన్ ఇంకా ముద్రగడ పద్మనాభం చుట్టూనే ఉన్నాడని వ్యాఖ్యానించడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కుల రాజకీయాలకు దూరంగా ఉంటున్న పవన్‌ని ముద్రగడతో లింక్‌పెట్టడం ఏమిటని? వారు నిలదీస్తున్నారు. జెసి సంచలనం కోసమో లేక సరదాగా చేశాడో తెలియదు కానీ పై వ్యాఖ్యలన్నీ ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువులుగా మారుతున్నాయి...!