హిట్టొచ్చినప్పుడు తనను మించిన వాడు లేరని, ప్లాప్ ఎదురైనప్పుడు కంగారుపడి అన్నీ అయిపోయినట్లుగా కనిపించడం సినీ పరిశ్రమలో చాలా సాధారణ విషయం. అయితే జయాపజయాలను సమానంగా స్వీకరించడం మానవత గల మనిషి లక్షణం. సంతోషానికి పొంగడం, దుఃఖానికి ఏడ్వడం మానవ నైజమౌతుంది. అన్నీ ఉన్నవారు కాదు కాదు, అన్నీ తెలిసిన వారు అణిగిమనిగి ఉంటారు, ఏమీ తెలియని వారే ఎగిరెగిరి పడుతుంటారనేది లోకోక్తి. ప్రస్తుతం శ్రీను వైట్ల జయాపజయాలను రెండింటినీ సమాన స్థాయిలోనే అనుభవించాడనే అనుకోవాలి.
ఎందుకంటే... అప్పట్లో స్టార్ దర్శకుడిగా శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు హీరోలంతా భలే ఉత్సాహాన్ని ప్రదర్శించేవారు. అసలు దూకుడు టైమ్‌లోనైతే శ్రీనువైట్ల ఏది చెప్తే అది వేదంగా బాసించేది. అలా దూకుడు అమిత పీక్ గా దూకేసి ఆగడుతో శ్రీనువైట్ల అసలు పూర్తిగా ఆగిపోయాడు. ఆగడుతో ఆగిపోవడంతోనే ఆయన చుట్టూతా వివాదాలు ముసురుకున్నాయి. ఆ తర్వాత ఆ సమస్యలను అధిగమించి బ్రూస్లీని తెరకెక్కించాడు శ్రీనువైట్ల. అదీ కూడా బాక్సాఫీసు వద్ద ఫట్టనడంతో ఇక చేసేది లేక పూర్తిగా అన్నీ అణచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక ఉనికి కాపాడుకొనే నిమిత్తం శ్రీను వైట్ల, నిర్మాతలకు ఏదో ఒకటి చెప్పుకొని మిస్టర్ తో తాను ఉన్నానంటూ ముందుకొస్తున్నాడు.
ప్రస్తుతం శ్రీనువైట్ల ఆశలన్నీ మిస్టర్ పైనే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఏలాగైనా హిట్ కొట్టాల్సిందేనన్న తలంపుతో తన ఎఫర్ట్స్ మొత్తాన్ని మిస్టర్ పైనే పెట్టి పని చేస్తున్నాడు శ్రీనువైట్ల. అయితే తాజాగా ఈ చిత్రంపై ఓ వార్త షికారు చేస్తుంది. శ్రీనువైట్ల ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోవడం లేదని కూడా తెలుస్తుంది. అయితే సినిమా హిట్టయిన తర్వాత లాభాలు వస్తే అప్పుడు వాటా ఇవ్వండని చెప్పాడట. నిజంగా దర్శకుడు ఇలాంటి ఆఫర్ ఇవ్వాలే గానీ అంతకంటే కావాల్సింది ఏముంది. అప్పట్లో మీడియా జోలికే రాని శ్రీనువైట్ల ఇప్పుడు మీడియా అంటే కూడా కాస్త ఇష్టం కనబరుస్తున్నాడని తెలుస్తుంది. శ్రీనువైట్ల మీడియా అంటేనే దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రచారం నిమిత్తం తప్పని పరిస్థితి అయిపోయింది.
ఇప్పుడు శ్రీనువైట్లనే డైరెక్టుగా మీడియాకు ఫోన్ చేసి ప్రచారం ఎలా చేస్తే బాగుంటుందంటూ సలహాలు సూచనలు తీసుకుంటున్నాడంటే ఈ దర్శకుడు ఏ స్థాయిలో మారిపోయాడో తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీనువైట్ల మిస్టర్ సినిమాను లైఫ్ అండ్ డెత్ గా తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. అందుకనే ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హెబా పటేల్, లావణ్య త్రిపాటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు.