స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలు పూర్తిగా ప్రజాతీర్పును ప్రతిబింబించలేవు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రజాతీర్పుగా భావించడానికి వీలులేదు. ఇక ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎన్నికలు మాత్రం కొద్దిగా ప్రజాతీర్పును ప్రతిబింబిస్తాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి పార్టీ వామపక్ష మద్దతుదారుల చేతుల్లో ఓడిపోవడం ఉద్యోగుల్లో చంద్రబాబు పట్ల ఉన్న వ్యతిరేకతను సూచిస్తుంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఓటమి నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. ఏపీలో చంద్రబాబు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని, బాబు వస్తే ఇంటికో జాబు వస్తుందని ప్రచారం చేశాడు. మరోవైపు నిరుద్యోగభృతి అన్నాడు. వీటిని నెరవేర్చలేదు.
దీంతో బాగా చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రుల్లో ఆయనంటే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు వస్తే జాబు వస్తుందనుకుంటే.. బాబు వాళ్ల బాబు లోకేష్‌బాబుకు ఎమ్మెల్సీ పదవి, త్వరలో మంత్రి పదవి మాత్రమే లభిస్తున్నాయి. కానీ నిరుద్యోగులకు మేలు జరగడం లేదు. భవిష్యత్తును, ఎప్పుడో 2025ను విజన్‌ను చేసుకొని, అప్పటికి ఏపీని నెంబర్‌వన్ చేస్తానని, నిరుద్యోగమే లేకుండా చేస్తానని బాబు డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నాడు. ఉద్యోగ కల్పన అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని బాబు ఒప్పుకోకుండా తాను వచ్చిన తర్వాత నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. పెద్దగా ప్రజాబలంలేని నారాయణ, సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి వారిని నమ్ముతున్నాడే గానీ ప్రజాబలం ఉన్న వారిని నమ్మడం లేదు.
స్వతహాగా చంద్రబాబుకు అభద్రతా భావం ఎక్కువ. తన తర్వాత నెంబర్ టూ అనే స్థానంలో ఎవ్వరూ ఎదగడాన్ని ఆయన సహించరు. దేవేందర్‌గౌడ్ నుంచి దివంగత మాధవరెడ్డి, నాగం జనార్థన్‌రెడ్డి, ఇలా అందరి విషయంలో అది బాగా స్పష్టమైంది. ఇప్పుడు కూడా ఆయన నెంబర్ టూగా లోకేష్‌ను చేయాలని చూస్తున్నాడే గానీ ఈ విషయంలో నందమూరి ఫ్యామిలీని కూడా నమ్మడం లేదు. తన నీడను కూడా ఆయన నమ్మడు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ ఒంటెద్దు పోకడలను మానుకోకపోతే వచ్చే 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంతో హాని జరిగే అవకాశం ఉంది. కేవలం వైసీపీ, జగన్‌లు విఫలం అవుతుండటమే చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశం. కానీ ప్రతిపక్ష వైఫల్యం వల్ల, సరైన ప్రత్యామ్నయం లేకపోవడమే బాబుకు ప్లస్ అవుతుందే గానీ బాబుకు నిజంగా ఇప్పుడు ఏపీలో క్షేత్రస్థాయిలో అనుకూల పవనాలు లేవు.