ఎందెందు వెతికానా అందందు రికార్డులు కూడా మనకు కనిపిస్తాయి. కానీ కొందరు మాత్రం ఇవి కూడా రికార్డులేనా అంటారు. ఇక టాలీవుడ్‌లో మెగాహీరోలకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వారి చిత్రాలు హిట్టయినా, ఫట్టయినా వారి క్రేజ్ మాత్రం తగ్గదు. ఇక ప్రస్తుతం మెగాహీరోల ముందు ఓ అరుదైన రికార్డు వేచివుంది. దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్‌కళ్యాణ్‌పైనే ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే.. ఈమద్య మెగాహీరోలు ఎక్కువగా రీమేక్‌లు చేస్తున్నారు. రామ్‌చరణ్ 'ధృవ' చిత్రాన్ని తమిళ 'తని ఒరువన్' రీమేక్‌గా తీశాడు. ఈ చిత్రం అప్పటివరకు ఇబ్బందుల్లో ఉన్న చరణ్ కెరీర్‌ను గాడిన పడేసింది. 50కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా ఓవర్‌సీస్‌లో, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లో చరణ్‌కు పట్టునిచ్చింది. ఈచిత్రం కిందటి ఏడాది డిసెంబర్‌లో విడుదలైంది.
ఆతర్వాత పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. కలెక్షన్లపరంగా ఈ చిత్రం నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఇది కూడా తమిళ 'కత్తి'కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక మరో రెండు రోజుల్లో పవన్‌కళ్యాణ్ 'కాటమరాయుడు' ద్వారా వస్తున్నాడు. ఈ చిత్రం కూడా తమిళ 'వీరం'కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం కూడా విజయం సాధించిన పక్షంలో మెగాహీరోలు తమిళ రీమేక్ హ్యాట్రిక్‌ను సాధించనట్లవుతుంది.
పవన్ ఈ హ్యాట్రిక్‌ను మెగాహీరోలకు సాధించి పెడతాడా? లేదా? అనే ఆసక్తి మొదలైంది. మొత్తానికి మెగాహీరోలు రీమేక్‌ల విషయంలో కొత్త రికార్డు సృష్టించనున్నారనే సెటైర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.