తప్పులు చేయడం మానవ సహజం. కానీ తప్పులను ఒప్పుకొని ఆ పొరపాట్లను తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇక ఎందరో మేథావులు కూడా కొన్ని విషయాలలో తప్పులు చేస్తుంటారు. దాన్ని భూతద్దంలో చూడకూడదు. కానీ జక్కన్నవంటి మేథావి తప్పులు చేస్తే రేపు బాలీవుడ్ వారు కూడా ఆయన్ను వేలెత్తి చూపుతారనేది వాస్తవం. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి పండితుడు, 'నువ్వే కావాలి' అనే చిత్రంలో 'అనగనగా ఆకాశం ఉంది... ఆకాశంలో మేఘం ఉంది....' అంటూ ఓ సూపర్‌హిట్ పాటను రాశారు. ఆ పాట ఆనాడు ఆబాలగోపాలాన్ని అలరించింది.
కానీ ఒక్క సందేహం ఏమిటంటే.. 'అనగనగా....' అనే పదాన్ని తెలుగులో సహజంగా ఎప్పుడు వాడుతాం? అనేది మనం ఆలోచించాలి. సహజంగా పూర్వకాలంలో ఒక వ్యక్తి లేదా వస్తువు ఉన్నప్పుడు, అది ప్రస్తుతం లేనప్పుడు మాత్రమే మనం 'అనగనగా...' అనే పదాన్ని ఉదహరిస్తాం. ఉదాహరణకు అనగనగా ఓ రాజు ఉండేను. అంటే ఆ రాజు ఇప్పుడు లేడు అని అర్ధం. అనగనగా శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు ఉండేవాడు. అంటే ప్రస్తుతం ఆ శ్రీకృష్ణదేవరాయలు లేరు.. అనేది తెలుగు వ్యాకరణం చెబుతుంది. కానీ సిరివెన్నెల గారు 'అనగనగా ఆకాశం ఉంది. ఆకాశంలో మేఘం ఉంది... ' అని రాశారు. కానీ ఆకాశం అనగనగా ఉండి.. ఇప్పుడు లేకపోతే దానికి అనగనగా అనే పదం వాడాలి. కానీ ఆకాశం, మేఘం అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇది చిన్న పొరపాటు మాత్రమే.
ఇక జర్నలిస్ట్ నుంచి పాటల రచయితగా ఒక వెలుగు వెలుగుతున్న భాస్కరభట్ల ఇప్పుడు అద్భుతమైన వాడుక భాషలో సింపుల్ పదాలను వాడుతూ హిట్ సాంగ్స్‌ను రాస్తున్నారు. కానీ ఆయన తన కెరీర్ మొదట్లో శ్రీకాంత్, సునీల్ హీరోలుగా వచ్చిన 'ఆడుతూ..పాడుతూ' అనే చిత్రంలోని ఓ పాటలో 'ఆడాలే ఆడ మయూరం..' అనే పదాలను వాడారు. వాస్తవానికి ఈ పదప్రయోగం తప్పు. 'మయూరం' అంటేనే ఆడది. కానీ ఆయన ప్రాస కోసం పడిన ప్రయత్నంలో అనుకోకుండా 'ఆడ మయూరం' అని వాడారు. ఇది కూడా తప్పే. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. వీటిని ప్రస్తావించి సిరివెన్నెల, భాస్కరభట్ల వంటి వారిని విమర్శించడం ఉద్దేశ్యం కాదు. వారు మేథావులు.
మేము రాసే వాటిల్లో కూడా ఎన్నో ఎన్నెన్నో తప్పులు, పొరపాట్లు జరుగుతుంటాయి. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లోని 'నువ్వు నాపక్కనుండగా,.. మామా' అనే వాక్యంలో వ్యాకరణ దోషం ఉందనేది వాస్తవం. కావాలంటే తెలుగు పండితులను లేదా జక్కన్నను, విజయేంద్రప్రసాద్‌ని అడిగినా కూడా వారు కూడా ఆ తప్పును ఒప్పుకుంటారు. ఆ డైలాగ్ ఇలా ఉంది... 'నువ్వు నా పక్కన ఉన్నంత వరకు.. నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు.. మామా...' అని ఉంది. కానీ ఆ వాక్యం కింది విధంగా ఉండాలి. 'నువ్వు.. నా పక్కన ఉన్నంతవరకు నన్ను చంపే మగాడు పుట్టబోడు మామా...' అని ఉండాలి. కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ రెండు వ్యాక్యాలను చదివితే మీకే అందులోని వ్యాకరణ దోషం స్పష్టంగా అర్దమవుతుంది. ఇక్కడ ఉద్దేశ్యం రాజమౌళి, బాహుబలి చిత్రాలను విమర్శించడం కాదు. కాస్త జాగ్రత్త పడమని మాత్రమే.