పిఈటీ మాస్టార్ నుంచి సినీ హీరోగా, నిర్మాతగా, విలక్షణ నటునిగా పద్మశ్రీ వరకు ఎదిగిన వ్యక్తి మోహన్‌బాబు. కాగా ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ దయతో రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశాడు. కానీ కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల చంద్రబాబును కలిశాడు. ఆ తర్వాత జగన్‌తో మంతనాలు జరిపాడు. ప్రస్తుతం ఆయన తన కుమార్తె మంచులక్ష్మికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇప్పించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. జగన్ తనకు మంచి సన్నిహితుడు కావడం, తన పెద్ద కుమారుడు విష్ణు భార్య జగన్‌కి దగ్గర బంధువు కావడంతో ఆ విధంగా ఆయన తన ప్రయత్నాలను మొదలు పెట్టాడని తెలుస్తోంది.
తిరుపతి, చిత్తూరు రెండు శాసనసభ నియోజకవర్గాలు రిజర్వ్‌డ్ స్దానాలు కావడంతో తన కుమార్తెకు చంద్రగిరి, శ్రీకాళహస్తిలలో ఏదో ఒక సీటు ఇవ్వాలని జగన్‌ను కోరాడట. కానీ ఈ రెండు స్థానాలను ఇప్పటికే ఆయన మరో ఇద్దరు తన సన్నిహితులకు మాటిచ్చేశాడు. దాంతో రాజంపేట నుంచి అవకాశం ఇస్తానని, కానీ అది మంచు లక్ష్మికి కాదని, కావాలంటే మోహన్‌బాబు స్వయంగా పోటీ చేయదలుచుకుంటే మాత్రం రాజంపేట ఇస్తానని జగన్ చెప్పినట్లు సమాచారం. కానీ మోహన్‌బాబు వైసీపీలో చేరాలంటే తన కుమార్తె మంచు లక్ష్మికి చంద్రగిరి, లేదా శ్రీకాళహస్తి సీటు ఇవ్వాలని, ఇక తాను కూడా ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయదలుచుకోలేదని, కాబట్టి తనకు తన గురువు దాసరిలా రాజ్యసభ సీటును మరోసారి ఇవ్వాలని కండీషన్ పెట్టడంతో జగన్ చూద్దాం.. అని తప్పించున్నాడని తెలుస్తోంది.
ఇక మోహన్‌బాబు, పవన్‌కళ్యాణ్‌లు బద్ద విరోధులు. ఇప్పటికే పవన్ జనసేన వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగుతోంది. పవన్ కూడా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పాడు. మరి ఈ పరిస్థితుల్లో మోహన్‌బాబును తమ పార్టీలో చేర్చుకోవడం తమకు ప్లస్ అవుతుందా? లేదా మైనస్ అవుతుందా? అనే డైలమాలో జగన్ ఉన్నాడట.