ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా.. ఇద్దరూ దిగ్గజాలే. వీరు నిజమైన లెజెండ్స్. కాగా ప్రస్తుతం వీరిద్దరి మద్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. బాలు తన పాటల కార్యక్రమాల్లో తాను సంగీతం అందించిన పాటలను పాడటానికి వీలులేదని చెప్పి బాలుకి లీగల్ నోటీసులను ఇళయరాజా పంపాడు. కానీ దీనిని సెన్సేషన్ చేయవద్దని బాలు కోరాడు. కాగా ఈ విషయంపై ఈ రోజు దినపత్రికల్లో పలువురు సంగీత దర్శకుల, గాయనీగాయకుల, ఆడియో సంస్థల అధినేతల వాదనలను ప్రచురించారు. కాబట్టి బాలు ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని చెప్పినప్పటికీ ఇందులో ఈ ఇద్దరి లెజెండ్స్ ఇగోలు దెబ్బతిన్నాయని, ఇద్దరిది తప్పేనని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
కాగా గతేడాది ఇళయరాజా అమెరికాలో పలు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ప్లాన్ చేశాడట. అందులో భాగంగా ఆ కార్యక్రమ నిర్వాహకులు ఇళయరాజా చెప్పిన తర్వాత బాలు వద్దకు వెళ్లి, ఈ కార్యక్రమంలో బాలుని పాటలు పాడమని కోరారట. కానీ ఆ కచ్చేరిలలో పాటలు పాడేందుకు ఎస్పీబాలు ఇళయరాజా కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. దాంతో ఇళయరాజా.. బాలు లేకుండానే కొత్త గాయనీ గాయకులతో ఆ కార్యక్రమాన్ని నడిపాడట. కాగా ఇప్పుడు బాలు, ఆయన కుమారుడు చరణ్‌లు ఎస్పీబీ 50 పేరు మీద అమెరికాలో కచ్చేరిలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అది తెలుసుకున్న ఇళయరాజా తన పాటలను తన అనుమతి లేకుండా బాలు పాడటానికి వీలులేదని ఏకంగా లీగల్ నోటీసులు పంపాడట.
ఇక ఇళయరాజా సన్నిహితులు మాత్రం ఇళయరాజా తనకు ఫలానా మొత్తం కావాలని అడగలేదని, తనకు కూడా ఎంతో కొంత కాపీరైట్ కింద ఇవ్వాలని మాత్రమే కోరాడంటున్నారు. ఇక ఎస్పీ బాలు సన్నిహితులు మాత్రం బాలుకి పర్సనల్‌గా ఫోన్‌చేసి, లేదా మరో రకంగా తన కోపాన్ని తెలియజేస్తే హుందాగా ఉండేదని, కానీ ఏకంగా లీగల్ నోటీసులు పంపి తన స్థాయిని ఇళయరాజా తగ్గించుకున్నాడని ఆవేదన చెందుతున్నారు.