పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' వచ్చి చిరు స్టామినా ఇప్పటికీ ఏమిటో ప్రూవ్ చేసింది. ఇక ఈ చిత్రం కలెక్షన్లు నాన్‌బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాయి. ఇక ఇదే సంక్రాంతికి బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' కూడా మంచి విజయం సాధించి, ప్రశంసలందుకొంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు చిత్రాలు 2017లో సంక్రాంతికి విడుదలైనా కూడా వీటి సెన్సార్ కార్యక్రమాలను మాత్రం కిందటి ఏడాది డిసెంబర్ చివరలో జరిపారు. దీంతో 2016వ సంవత్సరానికి గాను, ఈ రెండు చిత్రాలను జాతీయ అవార్డుల ఎంపికకు పంపించారని అంటున్నారు.
ఇక 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తమిళ 'కత్తి'కి రీమేక్ అయినప్పటికీ ఏదో ఒక కేటగిరిలో ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చేలా చేయాలని, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి కేంద్రంలో తనకున్న పలుకుబడి, పరిచయాల ద్వారా జ్యూరీకి రికమెండ్ చేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక కేంద్రంలో ఉన్నది టిడిపి భాగస్వామ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కావడం, బాలయ్య, చంద్రబాబులకి ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు, పలుకుబడి ఉండటంతో 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి అవార్డు కోసం ప్రయత్నిస్తున్నారని, ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్‌తో కూడిన దేశభక్తి, చారిత్రక చిత్రం కావడంతో ఈ చిత్రానికి జ్యూరీ సభ్యులు అవార్డు ఇచ్చేలా పైరవీలు జరుగుతున్నాయని సమాచారం.
మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియకపోయినా, నిప్పులేనిదే పొగరాదు... రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? చిరు, బాలయ్యలు తలుచుకుంటే అవార్డులకు కొదువా అనే సెటైర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి.