ఈమధ్య పోటీ ఎక్కువ కావడంతో ఎవరు ముందుగా రివ్యూలు ఇస్తారు? ఏ ఫొటోలను ఎవరు ముందుగా పెడతారు? అనే హడావుడిలో పడి మీడియా వారు పొరపాట్లు చేయడం మామూలైపోయింది. పిలవని పేరంటానికి వెళ్లి, మీడియా వారు ఉదయ్‌కిరణ్, చిరు కుమార్తెల నిశ్చితార్ద వేడుకలో పర్మిషన్ లేకుండా పొటోలు తీయాలని తాపత్రయ పడ్డారు. దీంతో పవన్ ఏకంగా ఓ మీడియా ప్రతినిధిని కొట్టాడు. ఇక తాజాగా కూడా ఓ సంఘటన మీడియా ప్రతినిధులకు గుణపాఠంగా మారింది. తాజాగా ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి, అమితాబ్‌బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ అలియాస్ ఐశ్వర్యాబచ్చన్ తండ్రి కృష్ణరాయ్ కన్ను మూశారు. ఈయన దహన సంస్కారాలకు ఐశ్వర్యా, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియా ఫొటోగ్రాఫర్లు ఏడుస్తూ, కళ్లు చెమర్చిన ఐశ్వర్యారాయ్‌ను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. వారిని అదుపు చేయడం ఎవ్వరి వల్లా కాలేదు. కాగా ఈ విషాద వేడుకలో ఐశ్వర్యారాయ్ కంటతడి పెడుతోన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. తమ అభిమాన హీరోయిన్ కంట తడిపెట్టడం చూసి ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇదేదో ఓ వేడుకలాగా మీడియా ఫొటోగ్రాఫర్లు ఎగబడి ఫొటోలు తీసుకున్నారు. అదే సమయంలో ఎంతో విషాదంలో ఉన్న ఆమె ఫొటోలను తీసి క్యాష్ చేసుకోవాలని చూశారు. దీనిపై తాజా సంచలనం అలియాభట్ సోదరి షాహీన్ భగ్గుమంది, మీడియా వైఖరిని ఉతికి ఆరేసింది.
ఈ విషాదఘటనను సెన్సేషల్ చేయాలని చూసిన మీడియాను కడిగిపారేసింది. సంతోషకరమైన వార్తల సమయంలో ఇలా జరిగినా ఫర్వాలేదు... కానీ ఓ విషాద ఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులు పడే ఆవేదనను కూడా క్యాష్ చేసుకోవడమంటే శవాలపై చిల్లర, బొరుగులు ఏరుకోవడంతో సమానం అనేది ఒప్పుకోవాలి. ఇలాంటి విషయాలలో మీడియా కాస్త సంయమనంతో వ్యవహరించాలి.