రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు చాలా సహజమే. కానీ ఒక పార్టీకి అధినాయకులుగా ఉన్న వారు సైతం ఓడిపోతున్నారంటే అప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. అలా ఓడిన వారిని, వారి తరఫు కార్యకర్తలను అందరినీ వెంటాడి వేటాడే విషయం అది. అది ఆ నాయకుడి వ్యూహ రచనలో లోపమనే కార్యకర్తలు కూడా భావిస్తారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోవడం అంటే వైకాపా ఓడిందనే అర్థం. విశాఖలో వైఎస్ విజయమ్మ ఓటమితో ఇంకా పార్టీ తేరుకోక ముందే వివేకాకు ఇలాంటి ఓటమే రావడంతో అస్సలు జీర్ణించుకోలేక పోతుంది పార్టీ. వైజాగ్ లో వైఎస్ విజయమ్మను తాము గెలిపించుకుంటామని పలికిన నాయకులనంతా ఆ తర్వాత జగన్ దూరంగా పెట్టాడు. మళ్ళీ అలాంటి పరిస్థితి వైఎస్ ఇలాకాలో ఎదురవడంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పార్టీని పటిష్టపరిచేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు వాటిపై పడుతున్నాడు. మహా అయితే మరో కొన్నిరోజుల పాటు వైకాపా నాయకులంతా తెదేపా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందనీ, క్యాంపు రాజకీయాలు నడిపిందనీ, ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందనీ అలా గట్టిగా ప్రగల్భాలు పలుకుతుందే తప్ప అసలు పార్టీలో ఎలాంటి లోపాలున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై ఆ పార్టీ నాయకత్వం ఏమాత్రం దృష్టిపెట్టదు.
2014 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై ఓడిపోయామని జగన్ పలు సందర్భాల్లో చెప్పినట్లు అందిన సమాచారాన్న బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోవడానికి ఏం కారణం చెప్తాడు. అసలు జగన్ కొన్ని విషయాల్లో చాలా పక్కాగా ఉంటాడు. జగన్ ఈ సీటు పక్కాగా మనదే అని అనుకుంటే తప్ప తనకు బాగా అయిన వారిని గానీ, కుటుంబ సభ్యులను గానీ అక్కడ పోటీకి నిలబెట్టడు. ఎందుకంటే ఆ తర్వాత జరిగే పరిణామాలను తాను తట్టుకోలేక. ఆ ప్రభావం భవిష్యత్తు రాజకీయాలపై పడుతుందన్న రాజనీతిని ముందుగానే గుర్తించి అలా చేస్తుంటాడు. అయితే జగన్, బాబు వ్యూహాన్ని ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కోల్పోయినట్టుగానే తెలుస్తుంది. బాబు వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పన్నే జగన్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలాంటి షాక్ లు ఎందుకు చవి చూడాల్సి వచ్చిందో పార్టీ యంత్రాంగానికే అర్థం కావాలి.
అయితే నిజంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైకాపాకు ఎదురుదెబ్బే. అందులో సందేహం ఏమాత్రం లేదు. కానీ వైకాపా మాత్రం తెదేపా అధికారంలో ఉంది కాబట్టి ఇలా జరిగిందిలే అనే తేలిక భావంతో వ్యవహరిస్తుంది గానీ, ఇది నిజంగా రాబోవు ఎన్నికలకు రెఫరెండం లాంటిదే. ఇప్పటికైనా పార్టీకీ హోల్ అండ్ సోల్ ఒక్కరే అన్నట్లు కాకుండా అధినేతలా ఆదేశాలు ఇచ్చినా..కింది స్థాయి కార్యకర్తలకు నమ్మకంగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ క్యాడర్ ను పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది లేనప్పుడు ఎన్ని చానళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎన్ని పేపర్ల ఎలా రాసినా నిరుపయోగమే అవుతుంది. ఇంకా ఇంతజరుగుతున్నా తెలియవచ్చేదేంటంటే... అసలు బలమైన నాయకులను, పార్టీకి ప్రజలను నమ్మకంతో చేరువ చేసే గణాన్ని వైకాపా ఏర్పరచుకోలేక పోతుంది.
ఏది ఏమైనప్పటికీ ఈ సారి వైఎస్ఆర్ సానుభూతితో ఎన్నికలు ఉండవు. జగన్ సామర్ధ్యం, ఆయన ఏర్పరచుకునే పార్టీ యంత్రాంగంపైనే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడుతుంది కాబట్టి ఆళ్ళకు కాస్త చెప్పన్డర్రా. మారమని. ఇంకా ఇగోలతో ఎవరికి వారు అలాగే మోనార్కులా చేసుకుంటూ పోతుంటారు. మారండయ్యా బాబూ.