ఇళయరాజా, ఎఆర్‌రెహ్మాన్‌లతో పాటు సంగీత దర్శకుల, పాటల రచయతల గొప్పతనమే తాను ఈ స్థాయికి రావడానికి కారణంగా ఎంతో మర్యాదతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే లెజెండ్ చెబుతూ ఉంటాడు. కానీ ఇటీవల కాలంలో ఇళయరాజా, రెహ్మాన్‌ల వంటి తమిళుల ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉంది. వారు ఎస్పీ బాలును టార్గెట్ చేస్తున్నారు. ఇక తమ సంగీతంలో ఇళయరాజా, ఏ ఆర్ రెహ్మాన్‌లు ఎంత లబ్దప్రతిష్టులో గానంలో గాన గంధర్వుడు బాలుది కూడా అదే స్థాయి. కాగా ఇళయరాజా ఒకానొక సమయంలో బాలు తన హవాను చాటడానికి ఎందరో గాయకులను అణగదొక్కాడని ఇన్‌డైరెక్ట్‌గా ఆరోపించాడు. ఇక రెహ్మాన్ అయితే బాలు ఏకచ్చత్రాధిపత్యాన్ని సవాల్ చేసి, ఆయన్ను పక్కనపెట్టి కొత్త వారిని, కొత్త గొంతులను ప్రోత్సహించి, బాలు ఆధిపత్యాన్ని అడ్డుకున్నాడు. ఇళయరాజా, రెహ్మాన్‌ల ఇద్దరి వాదనలో నిజం కూడా ఉంది.
కానీ ఏ పరిశ్రమలోనైనా, ఏ క్రియేటివ్ ఫీల్డ్‌లోనైనా ఇది సహజమే. మహావృక్షాల కింద చిన్న చెట్టు ఎక్కువగా ఆకట్టుకోలేవు... ఎదగలేవు. ఇళయరాజా, రెహ్మాన్‌లు కూడా ఇతర సంగీత దర్శకుల పట్ల ఇలాగే ప్రవర్తించేవారు. స్వరజ్ఞాని, కరతలామలైవులుగా పేరొందిన ఈ ఇద్దరు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా తమ కెరీర్‌లో కేవలం కొందరు దర్శకులు, నిర్మాతలకు మాత్రమే ఎక్కువగా పనిచేశారు. ఇతరులు వారి డేట్స్‌ని అడిగితే గొంతెమ్మకోరికలు, ఆకాశాన్నంటే పారితోషికాలు చెప్పేవారు. శంకర్, మణిరత్నం, గౌతమ్‌మీనన్ వంటి వారికి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకునే వారు. దీనిని కూడా మనం తప్పుపట్టలేం. కారణం అది వారి బిజినెస్. వారి కష్టానికి, శ్రమకు, మేథావితనానికి వారు వెలగట్టిన డబ్బులు. వీరు పెద్ద చిత్రాలకు ఒక విధమైన సంగీతాన్ని, చిన్న చిత్రాలకు పెద్దగా నాణ్యతలేని సంగీతాన్ని అందించేవారని కూడా చాలా మంది వాదిస్తారు. కానీ ఈ ఇరువురిని బాలు ఎప్పుడు కీర్తిస్తూనే ఉండేవాడు. కానీ వారు మాత్రం బాలుపై కక్ష్యగట్టారు.
ఆయన్ను మాటలతో చేతలతో వేధిస్తున్నారు. ఇక ఇళయరాజా అయితే ఆయనపై ఉన్న అక్కస్సును లీగల్ నోటీసుల ద్వారా వెళ్లగక్కాడు. మరోవైపు బాలు పాడటం తగ్గించుకున్న తర్వాత తన పాడుతాతీయగా వంటి కార్యక్రమాల ద్వారా మట్టిలో మాణిక్యాలను ఎందరినో వెలికితీస్తున్నాడు. కానీ ఇళయరాజా, రెహ్మాన్‌లు తమ సంగీత జ్ఞానాన్ని ఎంతవరకు ఇతరులకు పంచుతున్నారు? ఇక ఇళయరాజా ఎందరో గాయనీ గాయకులను తన చిత్రాలలోని పాటలు పాడకుండా అడ్డుకొని ఆశాబోంస్లే, లతా మంగేష్కర్ వంటి వారిని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం నిజం కాదా? ఇక క్రియేటర్స్‌లో ఎప్పుడు జెలసీ, సున్నితత్వం కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్లే ఆ ఇద్దరు అలా ప్రవర్తించి ఉండవచ్చు.
మరి అనేక సంగీత కార్యక్రమాలలో బాలునే కాకుండా ఎందరో ఇళయరాజా స్వరపరిచిన పాటలను పాడుతున్నారు. చిన్న చిన్న ఊర్లలో కూడా లోకల్ టాలెంట్ ఉన్న వారు, లోకల్ ఆర్కెస్ట్రా వారు పండుగలు, వేడుకలలో వీరి పాటలను పాడుతుంటారు. మరి వారిపై కూడా ఇళయరాజా ఇదే విధంగా కేసులు, నోటీసులు పంపుతాడా? మరి బాలుని తప్పుపట్టే వారు ఇళయరాజా, రెహ్మాన్ వంటి లెజెండ్స్ తమ కెరీర్‌లో ఎవ్వరినీ కాపీకొట్టలేదని సవాల్ చేయగలరా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. అలా అనుకుంటే మన కీరవాణికి, కె.జె.ఏసుదాస్‌కి కూడా పడదు. అంత మాత్రాన వారేమైనా ఇలా బిహేవ్ చేశారా? తోటి కళాకారులపై ఇళయరాజా ఇలా ప్రవర్తించడాన్ని తప్పుపట్టడం తప్పుకాదు కదా...!