వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవన్‌పై వ్యంగ్యమైన ట్వీట్ చేశాడు. తాను పవన్‌ని దేవుడని నమ్ముతానని, తిరుమల బాలాజీ, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం రాముడు వంటి వారిని పవన్ చేత రీప్లేస్ చేస్తే బాగుంటుందని వెటకారం జోడించాడు. తాజాగా జరిగిన 'కాటమరాయుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో అందరూ పవన్ భజన చేయడాన్ని, త్రివిక్రమ్‌తో పాటు బండ్లగణేష్... మై నేమ్ ఈజ్ బండ్లగణేష్,.. మై గాడ్ ఈజ్ పవన్‌కళ్యాణ్ అని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వర్మ ఈ సెటైర్ వేసినట్లు అర్ధమవుతోంది. వర్మ మరో సెటైరిక్ ట్వీట్‌ను చేశాడు. పవన్ ఓ వాడిపోయిన గులాబీ మొక్కను నిమిరాడు. ఆ కొమ్మకు జీవం వచ్చింది. ఆయన కరవు ప్రాంతంలో అడుగుపెట్టగానే, నీళ్లు పుష్కళంగా పడ్డాయి...అంటూ వెటకారం చేశాడు.
కాగా పవన్‌ని బాగా ఎరిగిన వారు మాత్రం పవన్‌ని మరీ పొగడ్తలతో ముంచెత్తి దేవుడితో సమానంగా పోల్చడం వంటి పద్దతులు సరికావని, వారు చేసే వ్యాఖ్యలు, వారి అనవసరపు పొగడ్తలే వర్మ వంటి వారికి బాగా అస్త్రాలుగా ఉపయోగపడుతున్నాయని, ఇక పవన్ అభిమానులు తమ హీరోను ఏదో ఊహించుకొని ఆయన్ను విమర్శిస్తేనే తట్టుకోలేని విధం ప్రవర్తిస్తున్నారని, ఆయన్ను విమర్శించిన వారిని టార్గెట్ చేస్తున్నారని, పవన్ ఇక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వర్మలు ఎందరో ఉంటారని, ప్రతి ఒక్కరు పవన్‌ని టార్గెట్ చేయడం సమంజసమేనని, ఈ పరిస్థితిని అభిమానులు అర్థం చేసుకుని, తమ హీరో మంచిని కోరేవారైతే పవన్‌కి మరిన్ని నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి ఆయన పురోభివృద్దికి ఉపయోగపడాలే గానీ, ఇలా విమర్శించిన ప్రతిఒక్కరిని టార్గెట్‌చేస్తామనే పద్దతి మంచిదికాదని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.
ఈ విషయంలోనే చిరు...... రాజశేఖర్, జీవిత, మోహన్‌బాబు వంటి వారి టార్గెట్‌కు గురయ్యాడని, చివరకు తమ హీరోకు వారి వీరాభిమానులు మంచి చేయకపోగా చెడును ఎక్కువగా చేశారని విశ్లేషిస్తున్నారు. దీనికి వర్మ, యండమూరి వంటి వారిని ఉదహరిస్తున్నారు. ఎంతటి పరిస్థితిలోనైనా నిగ్రహం కోల్పోకుండా ఉండాలని, విమర్శలను సహృదయంతో స్వీకరించే గుణం అలవర్చుకుని వర్మ కి ఓ పువ్వు (శంకర్ దాదా జిందాబాద్ స్టైల్) పంపించమని వారు కోరుతున్నారు. మరోపక్క 'కాటమరాయుడు' చిత్రం తమిళ 'వీరం'కు రీమేక్ అయినా కూడా ఈ చిత్రం తమిళనాడులో ఎక్కువ థియేటర్లలో విడుదలకానున్న పక్షంలో ఈ చిత్రం ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా వర్మ వంటి వారికి అది అదనపు బలం చేకూర్చి, 'సర్దార్' సమయంలో ఈ చిత్రం హిందీలో రిలీజై ప్లాప్ అయినప్పుడు వారు చేసిన వెటకారం మరోసారి పునరావృతం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.