తెలుగులో అపజయమెరుగని దర్శకధీరుడు, గురువుని మించిన శిష్యుడు, దర్శకదిగ్గజంగా తెలుగు సినిమా ఖ్యాతిని దిగంతాలకు పెంచి, తెలుగు జాతి పతాకాన్ని ప్రపంచ యవనికపై ఎగురవేసి ఇదీ తెలుగువాడి సత్తా అని నిరూపించిన జక్కన్న అలియస్ రాజమౌళి తన 'బాహుబలి-ది బిగినింగ్' తో చరిత్ర సృష్టించాడు. ఓ దక్షిణాది చిత్రం బాలీవుడ్‌లో 100కోట్లకు పైగా వసూలు చేయడమనేది ఒకప్పుడు భ్రమ. కానీ ఆయన తన సినీ మాయాజాలంతో, అత్యధ్భుతమైన విజన్, సాంకేతిక అంశాలపై ఉన్న పట్టుతో ఆ పని చేతల్లో చేసి చూపించాడు.
ఇక త్వరలో విడుదల కానున్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం టీజర్ అన్ని వుడ్‌లలో చూపుతున్న హవా మాటల్లో చెప్పలేం. కానీ ఇక్కడ ఒక్క విషయంలో జక్కన్న జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వారికి సొంతభాష మీద మమకారం, ప్రాంతీయాభిమానాలుంటాయి. ఇక ఉత్తరాది ఫిల్మ్‌మేకర్స్ నుంచి మీడియా వరకు ప్రాంతీయాభిమానాలను ఎక్కువగా చూపుతుంది. తమ బాలీవుడ్ చిత్రాలను ఎలా ఉన్నా ఆకాశానికి ఎత్తి ఒక 'దంగల్, పీకే' వంటి వాటిని చూపి మన దక్షిణాది నుండి వచ్చే చిత్రాలలోని తప్పులను భూతద్దంలో వెతికి వాటిని హైలైట్ చేయడం అక్కడి వారికి పరిపాటి.
ఇక మన మీడియా, మన విమర్శకులు సాధారణంగా ఏ చిత్రంలోనైనా లోపాలను ఎత్తిచూపుతారు. అది తప్పనిసరి, విమర్శకుల పని ఏమిటంటే... తప్పులను వెతకడం.. వాటిని విమర్శించే వారినే విమర్శకులు (క్రిటిక్స్) అని అంటారు. కానీ మన సినిమాలను మనం తప్పుపడితే ఫర్వాలేదు, కానీ మన చిత్రాలను పరాయి వారు విమర్శిస్తే మాత్రం మన మీడియాకు కూడ బాధగా ఉంటుంది. ఇక 'బాహుబలి' పార్ట్1 బాలీవుడ్‌లో సాధించిన ప్రభంజనం చూసి అక్కడి మేకర్స్, మీడియా కుళ్లుకున్నారు. చిన్న చిన్న లోపాలను కూడా ఎత్తి చూపుతూ అందులోని 145 తప్పులపై ఏకంగా ఓ వీడియో తయారు చేసి వదిలారు.
ఇక ఇప్పుడు బాహుబలి 2కి సంబంధించిన ప్రభాస్, అనుష్కలు విల్లు ఎక్కుబెట్టే పోస్టర్ నుంచి గజరాజుపై అధిరోహించిన పోస్టర్ వరకు అనేక తప్పులు, కాపీ వివాదాలు వచ్చాయి. ఇక ఈ చారిత్రక నేపధ్యం, అలాంటి బ్యాక్‌డ్రాప్ ఉన్న చిత్రాలలో సాధారణంగానే బోలెడు తప్పులు దొర్లడం మానవ సహజం. అలా చెప్పాంటే 'దంగల్, పీకే' వంటి చిత్రాలలో కూడా అనేక తప్పులున్నాయి. ఇక తాజాగా బాహుబలి సెకండ్‌పార్ట్ టీజర్‌లోని.. నీవు నా పక్కనున్నంత వరకు ... మామా...' అంటూ చెప్పే డైలాగ్‌లో వ్యాకరణ దోషం ఉంది. ఇది నిజం. కాబట్టి జక్కన్న బాలీవుడ్ విమర్శకుల బారిన పడకుండా ఉండాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది.