పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా.. అని ఓ మహాయోగి అన్నాడు. కాగా మనుషులందు.. వర్మవంటి మనుషులు వేరయ్యా అని మనం మార్చి చెప్పుకోవాలి. కొందరు ప్రముఖులు ఉంటారు. వారు నిజానికి మేథావులు, జీనియస్‌లే. కానీ ఒక్కోసారి,.. కాదు..కాదు.. తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలలో ముందుంటారు. ఇక టాలీవుడ్‌లో రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, దాసరి, మోహన్‌బాబు వంటి వారిని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీరు నిజంగా మేథావులే. కానీ తమ మేథస్సును వక్రంగా ఉపయోగిస్తూ ఉంటారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. వారి వ్యాఖ్యలు అంత:యుద్దాలకు కూడా దారితీస్తాయి. సమాజంపై తీవ్ర, విపరీత ధోరణులను చూపిస్తాయి.
ఒకానొక మహానుబాహుడు మేథావుల మౌనం ప్రమాదకరం అని చెప్పాడు. కానీ ఇక్కడ కూడా మనం ఓ సవరణ చేసుకోవాలి. మేథావుల వికృతరూపం కంటే మౌనమే మేలనే అభిప్రాయానికి రావాల్సివస్తుంది. వీరి మేథావి తనాన్ని సరిగా ఉపయోగిస్తే దేశం దూసుకుపోయి, అబ్దుల్‌కలాం, వాజ్‌పేయ్, మోదీ, మన్మోహన్‌సింగ్, పివి నరసింహారావు, సుబ్రహ్మణ్యస్వామిలా దేశానికి, యువతకు దారి చూపిన వారు అవుతారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.
వర్మ నిజంగానే జీనియస్. దాసరి, మణిరత్నం వంటి వారి కంటే ఎక్కువ మంది శిష్యులను నేరుగా, పరోక్షంగా మార్చి తనకంటూ ఓ స్కూల్‌ను ఏర్పాటు చేసుకుని ట్రెండ్‌సెట్టర్ గా నిలిచాడు. ఇప్పుడు ఆయన వల్ల ఎందరో మట్టిలోని మాణిక్యాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆయన చేసే వ్యాఖ్యలను, మాట్లాడే మాటలు, చేసే ట్వీట్లు చూస్తుంటే అవి నేటి సమాజం మీద, హీరోల అభిమానుల మీద ఎంత దుష్ట్రభావం చూపుతాయో అని భయం వేస్తుంది. వర్మలాంటి వారిని కెలకకూడదు. కెలికితే మరి నాలుగు రెట్లు తిరిగి గిల్లుతారు. ఒక సెటైర్ తమపై పడిందంటే ఆ సెటైర్ వేసిన వారికి వరుస ట్వీట్లు, పంచ్‌లు, సైటైర్లలో పిచ్చెక్కిస్తారు. వారు కొంతకాలం మౌనంగా ఉండవచ్చు. కానీ అది తుపాన్, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల ముందు ఉండే ప్రశాంతత లాగానే ఉంటుంది. ఒక్కసారిగా విరుచుకుపడతారు.
ఇక మెగా ఫ్యామిలీతో, మెగాహీరోలతో, మెగాభిమానులతో వర్మకి ఎలా? ఎందుకు చెడింది? అనేది ప్రస్తుతం అనవసరం. కానీ గత కొంతకాలంగా వర్మ మెగాహీరోలు, మెగాభిమానులనే టార్గెట్ చేసుకున్నాడు. ఆయన ట్రంప్ నుంచి కేసీఆర్, చంద్రబాబుల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడు. తానేమనుకుంటే అదే చేస్తాడు.
ఇటీవల హోళీ సందర్భంగా పక్కింటి అమ్మాయిల అందాలను తడిసిన బట్టల్లో చూసి ఆనందించేందుకే ఈ పండుగ అన్నాడు. అంతకు ముందు ఉమెన్స్‌డే రోజు మహిళలందరూ సన్నిలియోన్‌లాగా మగాళ్లకు ఆనందాన్ని పంచాలి.. అని ట్వీట్ చేశాడు. ఇక చిరు. పవన్‌లను ఆయన టార్గెట్ చేయడం మామూలైపోయింది. 'ఖైదీ', గౌతమీపుత్ర.. సందర్భంగా మెగాభిమానులను ఓ ఆట ఆడుకున్నాడు. ఇక పవన్‌ను అంతకు ముందు రాజకీయాలలోకి రావాలని కోరింది కూడా ఆయనే. ఇక ఈమధ్య పవన్ మీద, ముఖ్యంగా పవన్ తన వ్యక్తిత్వంపై, ఇగోపై దెబ్బకొట్టడంతో రెట్టించి కవ్విస్తున్నాడు. ఇక జల్లికట్టుసందర్భంగా పవన్‌ని పొగుడుతూ.. వెంటనే వైజాగ్‌లో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం పట్ల, పక్కరోజు ప్రెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో పెట్టడం పట్ల వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. మహేష్‌ని కూడా జల్లికట్టు ఉద్యమ సమయంలో ఉతికా ఆరేశాడు. ఎందరో స్టార్స్ మౌనంగా ఉన్నా సరే మహేష్‌బాబు మౌనాన్నే ఆయన ప్రశ్నించాడు. దీని వెనుక కూడా ఎంతో నిగూడార్ధం ఉంది.
ఇక తాజాగా ఆయన 'బాహుబలి-ది కన్‌క్లూజన్' ట్రైలర్‌ని ఆకాశానికి ఎత్త్తుతూ ట్వీట్స్ చేశాడు. అక్కడితో ఆగలేదు. టాలీవుడ్ పరిశ్రమ కుళ్లు సముద్రంలో మౌనంగా ఉందని, ఎందరో టాలీవుడ్ వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్వీట్స్ చేశాడు. అక్కడితో కూడా ఆగలేదు. మెగాస్టార్, పవర్‌స్టార్, సూపర్‌స్టార్‌లైన చిరు, పవన్, మహేష్‌లను ఉద్దేశించి పవర్‌ఫుల్ మెగాసూపర్‌స్టార్స్ మరో రెండున్నర జన్మలెత్తినా ప్రభాస్ కాలిగోటికి పనికిరారన్నాడు. ప్రభాస్ ముందు పదివేల మంది అమ్మాయిల అందం దిగదుడుపేనని వ్యాఖ్యానించాడు. దీంతో మెగాభిమానులు, మహేష్ అభిమానులు ఒక్కసారిగా బిత్తరపోయారు. కొందరైతే వర్మ కేవలం కొన్ని కుల, ప్రాంత వాదాలపైనే ఈ వ్యాఖ్యలు చేశాడని వ్యాఖ్యానించారు. కానీ వర్మను ప్రత్యక్షంగా ఎరిగిన వారు మాత్రం వర్మకు ప్రాంతీయ, కుల, మత భేదాలు లేవనే చెబుతారు. మరి ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు?
భవిష్యత్తులో మన స్టార్స్‌ని, వారి ఫ్యాన్స్‌ని సమైక్యంగా ఉంచాల్సింది పోయి.. ఇలా రెచ్చగొట్టడం ఏమిటని? తలలు బాదుకుంటున్నారు. పోనీ వర్మని టార్కెట్ చేద్దామా అంటే ఆయన మరింత రెచ్చిపోతాడని భయం. మొత్తానికి వర్మ పద్దతి మాత్రం సరైనది కాదని ఆయన అభిమానులు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు... అనేది నిజం. ఇక మన స్టార్స్ నేషనల్‌స్టార్స్ కావాలని ఆశపడి రీజనల్‌కు పడిపోయారని, ప్రభాస్ మాత్రం ఇంటర్నేషనల్ స్టార్‌గా ఒకే చిత్రంతో నిరూపించుకున్నాడనే వ్యాఖ్యల్లో నిజం ఉంది. చిరు, పవన్, రామ్‌చరణ్, మహేష్ నుంచి రజనీ, కమల్, విక్రమ్, ధనుష్ వరకు మన హీరోలను ఉత్తరాది వారు ఆదరించలేదు. అయినా అలాంటి వ్యాఖ్యలకు ఇది సరైన వేదిక కాదని వర్మ తెలుసుకోవాలి.